నిండు జీవితం నదిపాలు..
ఫోటో కోసం యువకుడు ఫోజులు.
ప్రమాదవశాత్తు జారి నదిలో పడిన వైనం.
కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు.
పాయకాపురం, ఆంధ్రప్రభ : నది వద్ద ఫోటో కోసం ఫోజులు ఇచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో కాలుజారి పడిపోయి ఆదివారం చనిపోయాడు.ఈ సంఘటన కృష్ణానది కరకట్ట వద్ద టుచేసుకుంది. మృతుడు శాంతినగర్ ప్రాంతానికి చెందిన యువకుడు కావడం గమనార్హం.అశ్రునయనాల మధ్య అయ్యప్ప అంత్యయక్రియలు నిర్వహించారు. వివరాలలోకి వెళితే శాంతినగర్ ప్రాంతానికి చెందిన అయ్యప్ప(23)కృష్ణా నది కరకట్ట వెంబడి విద్యుత్ స్తంబాలకు బ్యానర్ కట్టడానికి ముగ్గురు మిత్రులు, రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.

బ్యానర్లు కట్టిన తర్వాత ఒక యువకుడు తన బైకుపై ఇంటికి వచ్చేశాడు. మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్న నది వద్దకు సరదాగా ఫోటో దిగడానికి వెళ్లారు.వారిద్దరిలో ఒకడైన అయ్యప్ప నది ప్రక్కన ఉన్న నిచ్చెన ఎక్కి తన మిత్రుడుకి ఫోన్లో ఫోటో తీయాలని చెప్పాడు. అలాగే తను ఇలా జంప్ చేస్తూఉన్నట్లుగా ఫోటో కావాలని తన స్నేహితుడికి చెప్పాడు. సదరు మిత్రుడు అరేయ్ నీకు ఈత వచ్చా అని అడిగాడు. ఐతే తనకు ఈత రాదని చెప్పాడు. అలాగైతే క్రిందకు రా అని బదులు చెప్పాడు.ఇంతలో అక్కడే ఉన్న అయ్యప్ప ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు.
ఐతే అయ్యప్పకు ఈత వచ్చు కాబోలు అని మరొక మిత్రుడు అనుకొనేలోగా, ఎంతకీ నదిలో నుండి అయ్యప్ప బయటకు రాకపోవడంతో అక్కడే ఉన్న రబ్బరు ట్యూబ్ నదిలో వేశాడు. ఐనా సరే అయ్యప్ప బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు, మిత్రులకు,పోలీసులకు సమాచారం అందించాడు.ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు కన్నీటి పర్వంతం అయ్యారు.సరదా కోసం నది, రైలు వద్ద సెల్ఫీ ఫోటోలు కోసం ఫోజులు ఇచ్చి ప్రాణాలు తీసుకొన్న యువకులు అనేకులుగా ఉన్నారని, అయినా సరే యువకుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని తల్లిదండ్రుల గుండె కోత ఇప్పుడు ఎవరు తీరుస్తారని పలువురు నిట్టూర్పువిడుస్తున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాల మేరకు అయ్యప్ప మృతదేహానికి 61వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్, అన్నబతుల శ్రీను ఘన నివాళులు అర్పించారు.
