Olive Ridley | కాలుష్యపు కాటుకు జలచరాలు మృత్యువాత…

Olive Ridley | కాలుష్యపు కాటుకు జలచరాలు మృత్యువాత…
Olive Ridley | ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రభ : ప్రకృతి ప్రసాదించిన అపురూప సంపద, సముద్రపు రక్షకులుగా పేరొందిన జలచరాలు నేడు మృత్యుఘోష పెడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలు పర్యావరణ ప్రేమికులను, మత్స్యకారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏటా డిసెంబర్ నుండి మార్చి వరకు వేల కిలోమీటర్ల దూరం నుండి సంతానోత్పత్తి కోసం మన తీరానికి వచ్చే ఈ తాబేళ్లు, ఈ ఏడాది వరుసగా మృత్యువాత పడటం కలచివేస్తోంది. కేవలం తాబేళ్లే కాకుండా, పేరుపాలెం బీచ్ వద్ద ఒక భారీ డాల్ఫిన్ కూడా మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మృత్యువుకు దారితీస్తున్న కారణాలు..
నిపుణుల విశ్లేషణ, స్థానిక పరిస్థితుల ప్రకారం ఈ మరణాలకు ప్రధాన కారణాలు యాంత్రిక బోట్లు నిషేధిత వలలు తీరానికి అతి సమీపంలో మెకనైజ్డ్ బోట్లతో వేట సాగించడం వల్ల, వాటి ఇంజన్ల వేగానికి తాబేళ్లు గాయపడి చనిపోతున్నాయని చెబుతున్నారు.

అలాగే, కొన్ని రకాల వలల్లో చిక్కుకున్నప్పుడు అవి శ్వాస తీసుకోవడానికి పైకి రాలేక ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నాయని. సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నీటి నాణ్యత దెబ్బతిని, జలచరాలు విషతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం. సముద్ర గర్భంలో ఉష్ణోగ్రతల మార్పులు కూడా ఈ మూగజీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
పర్యావరణానికి జీవవైవిధ్యానికి కలిగే హాని…
సముద్ర జీవుల మరణం కేవలం ఒక జీవి అంతర్థానం కాదు, అది పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రధానంగాఆహారపు గొలుసులో అంతరాయం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తాబేళ్లు సముద్రంలోని జెల్లీ ఫిష్‌లను తిని వాటి జనాభాను నియంత్రిస్తాయని. తాబేళ్లు తగ్గితే జెల్లీ ఫిష్‌లు పెరిగి, అవి చిన్న చేపలను తినేయడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని మత్యకారులు చెబుతున్నారు. తాబేళ్లు పెట్టే గుడ్లు, వాటి పెంకులు తీర ప్రాంత ఇసుకలో పోషకాలను అందిస్తాయని. ఇవి లేకపోతే తీర ప్రాంత వృక్షజాలం దెబ్బతింటుందని.
ఆలివ్ రిడ్లే వంటి అరుదైన జాతులు అంతరించిపోతే, సముద్రపు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని. ఇది భవిష్యత్తులో సముద్ర కాలుష్యాన్ని మరింత పెంచి మానవాళిపై కూడా ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ మరణాలపై లోతైన విచారణ జరపాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
తీర ప్రాంతాల్లో వేటపై కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు, తాబేళ్ల సంరక్షణకు హాచరీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ”ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది.” ఈ మూగజీవుల మరణం మన పర్యావరణ విధ్వంసానికి హెచ్చరిక. ఇప్పటికైనా మేల్కొనాలని, సముద్ర సంపదను కాపాడాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
