Election l గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం..

Election l గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం..

పల్నాడు పల్లెల్లో… పంచాయతీల “వేడి”
ఓటర్ల జాబితా పై ఎన్నికల కమిషన్ ఆదేశాలు..!
మార్చి 9 కల్లా పూర్తి చేయాలని ఉత్తర్వులు…!!
ఏప్రియల్ 2 తో ముగియనున్న సర్పంచుల పదవీకాలం…!!

పల్నాడు, ఆంధ్రప్రభః రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పల్నాడు పల్లెల్లో పంచాయతీల వాతావరణం వేడెక్కింది. ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతుంది. పురపాలక, నగరపాలక, గ్రామపంచాయతీల పాలక వర్గాల పదవీ కాలాలు మార్చి 17, ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల ఫోటోలతో సహా తుది జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

జిల్లాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఇచ్చిన లాగిన్ ల ద్వారా జాబితాలు సేకరించి, వాటిలో నుంచి పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డులు, మండలాల్లో పంచాయతీల వారిగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2026 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా నవీకరించాలని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. కాగా ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 23, 24 తేదీలలో ముగియనుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు గ్రామపంచాయతీలకు, పురపాలక సంఘాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పకనే తెలుస్తోంది.

2001లో పల్నాడు జిల్లాలో 519 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 1000కి లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీల 69 కాగా, వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 451 ఉన్నాయి. గత ఎన్నికల్లో మున్సిపాలిటీలో విలీనమైన పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు ఈసారి వాటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారనేది అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. మొత్తం మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు మేరకు త్వరలో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగ వచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.