Telangana | సీఎం కప్ క్రీడలు లక్ష్యం ఇదే..

Telangana | సీఎం కప్ క్రీడలు లక్ష్యం ఇదే..
Telangana, నల్లబెల్లి, ఆంధ్రప్రభ : క్రీడలతో స్నేహ సంబంధాలు, సామజిక ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ క్రీడలు గ్రామాల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయని కొండాపూర్ గ్రామ సర్పంచ్ అబ్బరబోయిన లలిత సురేష్ తెలిపారు. మంగళవారం మండలంలోని కొండాపూర్ గ్రామంలో స్థానిక పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను ఆమె ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకులు, మహిళలు, చిన్నారులకు క్రీడా అవకాశాలను కల్పించడం ఈ క్రీడల ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. చదువుతో పాటు క్రీడలు ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ గురించి నేర్చుకుంటారని క్రీడాకారులకు సూచించారు. ఈ క్రీడలతో యువత, చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. వాలీబాల్, కబడ్డీ, షటిల్, క్రికెట్ వంటి క్రీడలతో పల్లెల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామస్థాయిలో జట్లు తయారు చేసి మండల స్థాయికి, ఆ తరువాత జిల్లా స్థాయికి ఎంపిక చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.
క్రీడల ద్వారా గ్రామీణ యువత ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు వారికి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం కల్పించడమే సీఎం కప్ లక్ష్యమని అన్నారు. ఈ క్రీడలు గ్రామీణ యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు స్నేహాం, ఐక్యత పెంపొందిస్తాయని లలిత సురేష్ పేర్కొన్నారు. కుల, రాజకీయ భేదాలు మరిచి ఒక్క జట్టుగా ఆడినప్పుడు నిజమైన గ్రామ ఐక్యత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పాల్గొని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డుసభ్యులు, యువకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
