Deputy Chief Minister | ఆత్మ గౌరవం కోసమే రాజకీయాల్లోకి : భట్టి

Deputy Chief Minister | ఆత్మ గౌరవం కోసమే రాజకీయాల్లోకి : భట్టి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాను ఆత్మగౌరవం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ఆత్మను కాపాడటమే తన లక్ష్యమన్నారు. ఆస్తుల సంపాదన కోసమో.. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకో తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఈ బొగ్గు బ్లాక్‌లకు టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ అని పేర్కొన్నారు.
ఈ టెండర్ల విషయంలో అడ్డగోలు రాతలు రాశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు చెప్పామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులందరూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామన్నారు. ఆరోపణలు రావడంతో మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎవరినో సంతృప్తి పరచడం కోసమే కథనాలు అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే, రాజీపడేది లేదన్నారు.
నీచ, నికృష్ట పనులు చేయించే క్యారెక్టర్ తనది కాదన్నారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంత వరకూ ఏ గద్దలను రానివ్వనన్నారు. వైఎస్ కు తాను అత్యంత సన్నిహితుడినని, వైఎస్ పై కోపంతో తనపై రాసిండొచ్చన్నారు. మీ అవసరాల కోసం కట్టుకథలు సృష్టిస్తే విజయం సాధించలేరన్నారు. నీ చిల్లర కథనాలకు ఎవరూ భయపడరన్నారు. 40సంవత్సరాలకు పైగా సభలో, బయటా పోరాటం చేసి ఇక్కడి వరకు వచ్చానన్నారు. ప్రత్యేక లక్ష్యం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
