పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌…

పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న క‌లెక్ట‌ర్‌…

అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…
95,598 మంది పరీక్షకు హాజరు…

పాయకాపురం, ఆంధ్రప్రభ : అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 97,047 మంది అభ్యర్థులను అక్షర ఆంధ్ర యాప్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయగా, అందులో 95,598 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడలోని వాంబే కాలనీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరుగుతున్న తీరును అధికారులతో కలిసి పరిశీలించి అభ్యర్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు.

అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చదవడం, రాయడం, ప్రాథమిక గణితం మాత్రమే కాకుండా డిజిటల్ లావాదేవీలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందడంతో పాటు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దాని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. ప్రసాదరావు, యూసీడీ పీవో ఎం.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply