కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది

  • ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

మునుగోడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అరాచక, అబద్ధాల పాలన కొనసాగుతోందని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు.

శనివారం మునుగోడులోని మణి గార్డెన్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్-2 కార్యక్రమంలో బీజేపీ బూత్ ఏజెంట్లకు అవగాహన కల్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో అమలు చేస్తున్న యూరియా యాప్ రైతులకు గుదిబండగా మారిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధులే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, నిరుపేదలకు అండగా నిలుస్తూ ధర్మపాలన కోసం బీజేపీ పనిచేస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, రాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెంబళ్ళ జానయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.