మామిడి రైతులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం కావాలి

మామిడి బోర్డు ఏర్పాటు.. ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణ అవసరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు జిల్లా మామిడి రైతులు ప్రతి ఏడాది గిట్టుబాటు ధరల సమస్యతో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. రైతులకు కిలోకు రూ.4 ఆర్థిక సహాయం ప్రకటించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మామిడి పరిశ్రమను సమగ్రంగా అభివృద్ధి చేసే విధానాలను ప్రభుత్వం రూపొందించాలని సూచించారు.

చిత్తూరులోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “సుస్థిర పంట సంరక్షణ విధానాల ద్వారా వికసిత్ భారత్ కోసం మామిడి రైతుల సాధికారత” అంశంపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

చిత్తూరు జిల్లా దేశంలోనే ప్రముఖ మామిడి ఉత్పత్తి ప్రాంతమని, ముఖ్యంగా తోతాపురి మామిడి సాగుపై వేలాది మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అయితే ధరల పతనం, పల్ప్ పరిశ్రమల కొనుగోలు సామర్థ్యం తగ్గడం, ఎగుమతుల్లో ఒడిదుడుకులు, నిల్వ సదుపాయాల కొరత కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మామిడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన అనంతరం ప్రభుత్వం కిలోకు రూ.4 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిందన్నారు. ఈ నిర్ణయం రైతులకు కొంత ఊరటనిచ్చినా, ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

చిత్తూరు మామిడి పరిశ్రమను కేవలం పచ్చి మామిడి విక్రయాలకే పరిమితం చేయకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా తీసుకెళ్లాలని సూచించారు. మామిడి పల్ప్ తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రై మామిడి ఉత్పత్తుల కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాకింగ్, గ్రేడింగ్ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కోరారు.

రైతులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిల్వ చేసుకునే అవకాశాలు కల్పిస్తే ధరలు పడిపోయే సమయంలో నష్టాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనువైన మామిడి రకాల సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, చిత్తూరు మామిడికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా బ్రాండింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) బలోపేతం చేయడం ద్వారా రైతుల బేరసారాల శక్తి పెరుగుతుందని, మధ్యవర్తులపై ఆధారపడకుండా పరిశ్రమలు, ఎగుమతిదారులతో నేరుగా అనుసంధానం అయ్యే వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు.

చిత్తూరు ఉద్యానవన రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ఎగుమతిదారులు కలిసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. శాస్త్రీయ సాగు పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, నీటి యాజమాన్యం, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై రైతులకు నిరంతర శిక్షణ అందించాలని సూచించారు.

చిత్తూరు మామిడి రైతులకు శాశ్వత భరోసా కల్పించాలంటే ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మామిడి బోర్డు ద్వారా ధరల స్థిరీకరణ, ఎగుమతుల ప్రోత్సాహం, పరిశోధన, ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధి, రైతులకు సాంకేతిక సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మామిడి బోర్డు ఏర్పాటు రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే అంశమైతే, దాని కోసం భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

సదస్సులో ఎస్‌వీసీఈటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌బాబు, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్, కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, మామిడి రైతులు పాల్గొన్నారు.