శ్రీసిటీలో 17న మెగా జాబ్ మేళా
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : శ్రీ సిటీలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (సీఐఐ ఎంసీసీ ట్రైనింగ్ సెంటర్)లో ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సత్యవేడు నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శ్రీ సిటీలోని 14 బహుళజాతి కంపెనీల్లో 500కుపైగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభించనుంది. జూలై 16లోపు : https://naipunyam.ap.gov.in/లో నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 94403 74535, 91216 46661, 99888 53335 ను సంప్రదించాలని సూచించారు.
