కుప్పకూలిన తోతాపురి…
కుప్పకూలిన తోతాపురి…
కళ్లముందే కుళ్లిపోతున్న మామిడి!
చిత్తూరు రైతును కుదేలు చేస్తున్న ధరల పతనం.. ఆందోళన బాటలో మామిడి రైతులు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: ఒకప్పుడు రైతుకు బంగారు పంటగా పేరొందిన తోతాపురి మామిడి ఈ ఏడాది రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. పండిన కాయలకు కొనుగోలుదారులు లేకపోవడం, ఉన్న కొనుగోలుదారులు అతి తక్కువ ధరలు చెప్పడం, మామిడి గుజ్జు పరిశ్రమలు పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో చిత్తూరు జిల్లా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు.
వేలాది ఎకరాల్లో పండిన మామిడి తోటల్లోనే కాయలు రాలిపోతుండగా, ఇప్పటికే కోసిన పంట ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి ట్రాక్టర్లలోనే నిలిచిపోతోంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
సీజన్ ప్రారంభంలో కిలో తోతాపురి మామిడికి రూ.7.50 వరకు ధర లభించింది. వారం రోజులు తిరగకముందే ధర రూ.6కు పడిపోయింది. తాజాగా రూ.5కు చేరగా, గురువారం నాటికి రూ.4కు పడిపోయింది. అధికారికంగా రూ.5 ప్రకటిస్తున్నప్పటికీ, రాంపుల్లో వర్తకులు కిలో రూ.3 నుంచి రూ.4 మధ్యే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పతనంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం పట్ల జిల్లాలోని మామిడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం దామలచెరువులో ‘రైతు గర్జన’ సభ నిర్వహించనున్నట్లు జిల్లా రైతు సంఘం నాయకులు తెలిపారు.
సగం సామర్థ్యంతోనే పరిశ్రమలు
చిత్తూరు జిల్లాలో మొత్తం 31 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉండగా, వాటిలో 28 పరిశ్రమలు మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో కూడా కేవలం 14 పరిశ్రమలు మాత్రమే తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు.
గతంలో రోజుకు 500 ట్రాక్టర్ల వరకు మామిడి అన్లోడ్ చేసుకునే పరిశ్రమలు ప్రస్తుతం 200 ట్రాక్టర్లను కూడా తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ ఫ్యాక్టరీ వద్ద గత మూడు రోజులుగా వందలాది ట్రాక్టర్లు క్యూలో నిలిచిపోయాయి.
చాలా ట్రాక్టర్లకు ఇప్పటికీ టోకెన్లు లేదా నంబర్లు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. కొన్ని ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్ మామిడి అన్లోడ్ కావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతోంది.
తోటల్లోనే రాలిపోతున్న కాయలు
ఇప్పటికే కోసిన మామిడిని ట్రాక్టర్లలో ఉంచితే నాణ్యత దెబ్బతింటోంది. మరోవైపు తోటల్లో ఉన్న కాయలు పక్వానికి వచ్చి చెట్ల కిందే రాలిపోతున్నాయి.
జిల్లాలో ఇంకా ఐదు శాతం కూడా మామిడి కోత పూర్తి కాలేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. కాయలు కోసినా కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేకపోవడం, కోయకపోతే చెట్ల కిందే రాలిపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల సమీక్షలు.. మారని పరిస్థితి
గత కొద్ది రోజులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్ తదితరులు ఫ్యాక్టరీలను సందర్శిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రైతులకు కనీసం కిలోకు రూ.7 ధర ఇవ్వాలని, జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు చేపట్టాలని సూచించినప్పటికీ పరిశ్రమల వైఖరిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ఆర్డర్లు తగ్గాయని, ఎగుమతులు మందగించాయని, ప్రస్తుతం అధిక ధరలకు కొనుగోలు చేస్తే భారీ నష్టాలు వస్తాయని చెబుతున్నాయి. దీంతో రైతులు, పరిశ్రమల మధ్య ధరల వివాదం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.
50 వేల మంది రైతుల జీవనాధారంపై ప్రభావం
ఈ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోకాకోలా సంస్థ ప్రతినిధులు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీఈడీఏ, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో తోతాపురి ధరలు, పరిశ్రమల సమస్యలు, రైతుల ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో సుమారు 50 వేల మంది తోతాపురి రైతులు ఉన్నారని, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 వేల మందికి పైగా రైతులు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
రైతులకు మెరుగైన ధరలు లభించేలా కొనుగోలు సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఫ్యాక్టరీలకు వచ్చే ట్రాక్టర్లను వచ్చిన క్రమంలోనే అన్లోడ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ జోక్యంపై రైతుల ఆశలు
ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాణిపాకం వచ్చినప్పటికీ మామిడి రైతుల సమస్యలపై ప్రత్యేకంగా స్పందించలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
గత ఏడాది ప్రభుత్వం తోతాపురి మామిడికి కిలోకు రూ.12 ధర వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం అందించగా, ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాల్సి ఉండేది. చివరకు రైతులకు సుమారు రూ.9 వరకు గిట్టుబాటు ధర లభించింది.
అయితే ఈ ఏడాది ధర ఒక్కసారిగా రూ.5కు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల మామిడి రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను వివరించారు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆ సమావేశం అనంతరం తోతాపురి కొనుగోలు ధరలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే రైతులు మాత్రం ఆ నిర్ణయం వచ్చేలోపు తోటల్లోని మామిడి కాయలు నేలరాలిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా దక్కకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం, పండిన కాయలు చెట్ల కిందే కుళ్లిపోతుండటం రైతులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గత ఏడాది తరహాలో మద్దతు ధర ప్రకటించాలని, అన్ని గుజ్జు పరిశ్రమలు కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
