Gir Lion Attack | పశువుల కాపరిపై సింహం దాడి
Gir Lion Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుజరాత్లోని గిర్ ప్రాంతంలో ఓ ఆడ సింహం పశువుల కాపరిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. భావ్నగర్ జిల్లా పలితానా పరిధిలోని గర్జియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పొలాల ప్రాంతంలో పశువులను మేపుతున్న ఓ కాపరిపై ఆడ సింహం ఒక్కసారిగా దాడి చేసింది. అతడి అరుపులు విన్న స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ అక్కడికి చేరుకోవడంతో సింహం భయపడి కాపరిని వదిలేసి సమీప అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది.
దాడిలో గాయపడిన పశువుల కాపరిని గ్రామస్థులు వెంటనే పలితానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో గిర్ అడవుల నుంచి ఆసియా సింహాలు ఆహారం కోసం సమీప గ్రామాలు, వ్యవసాయ పొలాలు, ఆలయ పరిసర ప్రాంతాలకు తరచూ వస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు గ్రామాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
ప్రపంచంలో ఆసియా సింహాలకు ఏకైక సహజ ఆవాసంగా గుజరాత్లోని గిర్ జాతీయ ఉద్యానవనం గుర్తింపు పొందింది. ఒకప్పుడు అంతరించిపోతున్న దశకు చేరుకున్న ఈ జాతి సంరక్షణ చర్యలతో గణనీయంగా పెరిగింది. గుజరాత్ అటవీ శాఖ గణాంకాల ప్రకారం 2020లో 674గా ఉన్న ఆసియా సింహాల సంఖ్య 2026 నాటికి 900 దాటింది. జనాభా పెరగడంతో దాదాపు సగం సింహాలు రక్షిత అటవీ ప్రాంతాల వెలుపల సంచరిస్తుండటంతో, మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణలు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
