34guarantees | రైతు సదస్సులో కేటీఆర్ ఘాటు విమర్శలు

34guarantees | రైతు సదస్సులో కేటీఆర్ ఘాటు విమర్శలు

34guarantees | వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వరంగల్ గడ్డపై కాంగ్రెస్ నయవంచనపై మరో పోరాటం మొదలైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, రాహుల్ గాంధీ ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’పై నిప్పులు చెరిగారు.

రాజకీయ సన్యాసానికి సిద్ధం
“రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా రైతులకు వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను” అని కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన మాట తప్పారని, ఆయన పేరు ‘ఎనుముల’ రేవంత్ రెడ్డి కాదు, ‘ఎగవేతల’ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

బోగస్ డిక్లరేషన్ – మోసపోయిన రైతాంగం
వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చి నేటికి నాలుగేళ్లు పూర్తయినా, అందులోని 34 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్న మాట ఇచ్చారని, పంటలకు రూ. 500 బోనస్, కౌలు రైతులుకు రూ. 14 వేల పెట్టుబడి సాయం ఎక్కడని నిలదీశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ‘రైతు భరోసా’ కాదు, అది ‘రాహుల్ బంద్’ అని. రైతులకు పెట్టుబడి సాయం అందక అప్పుల పాలవుతున్నారు,” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనే రైతులకు రక్షణ
కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులను రాజులుగా చూసుకున్నారని, 11 విడతలుగా రూ. 73 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చి సాగును పండుగ చేశారని, కానీ నేడు కాంగ్రెస్ నాయకులు ఇసుక దందాల కోసం చెక్ డ్యామ్‌లను పేల్చుతున్నారని మండిపడ్డారు. “రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాబంధుల రాజ్యం పోయి, మళ్ళీ రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది” అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

సదస్సులో చేసిన కీలక తీర్మానాలు..
-కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న 1,000 మందికి పైగా రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించాలి.

  • రూ. 2 లక్షల రుణమాఫీ వర్తించని రైతులకు తక్షణమే రుణ విముక్తి కల్పించాలి.
  • ఎగ్గొట్టిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వడ్డీతో సహా చెల్లించాలి.
  • కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
    ఆంక్షలు లేకుండా అన్ని పంటలను రూ. 500 బోనస్‌తో కొనుగోలు చేయాలి.

Leave a Reply