అనధికార సమావేశాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు: సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ అనధికారికంగా సమావేశాలు నిర్వహిస్తూ రైతులు, గ్రామ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని గ్రామ సర్పంచ్ బొజ్జ గీత అమరేందర్ రెడ్డి ఆరోపించారు. పామ్ ఆయిల్‌పై అవగాహన సదస్సు, గ్రామ సమావేశాల పేరుతో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించినప్పటికీ గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రీయూనిక్ కంపెనీ అధికారులతో కూడా గ్రామ పంచాయతీకి సమాచారం లేకుండానే సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు.
పామ్ ఆయిల్ సాగుపై రైతులకు సరైన అవగాహన కల్పించడం అవసరమేనని, అయితే గ్రామ పంచాయతీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఐకేపీ కొనుగోలు విషయంలో కూడా మాజీ సర్పంచ్ రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారని, వడ్లు రవాణా కోసం వచ్చిన లారీలను వెనక్కి పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోళ్లను సాఫీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోందని, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
గ్రామ సభలు, సమావేశాల సమయంలో మాజీ సర్పంచ్ అనుచరులు గొడవలకు దిగడంతో పాటు కుర్చీలు ధ్వంసం చేసి కొందరిపై దాడి చేశారని ఆరోపించిన సర్పంచ్, ఈ ఘటనపై ఉప్పునుంతల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం, రైతు సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
