గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ: గిరిజనుల హక్కుల పరిరక్షణ, జాతి ఐక్యతను చాటే లక్ష్యంతో గురువారం అచ్చంపేటలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్‌లో గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లపై చర్చించారు.

అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభ చేపట్టనున్నట్లు తెలిపారు. 1976లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ఆమోదింపజేసి లంబాడి, ఎరుకల, యానాది కులాలను ఎస్టీలుగా గుర్తించిన చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ నుంచి ఆమనగల్ మీదుగా అచ్చంపేట వరకు గిరిజన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భారీ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తండాల ప్రజలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. గిరిజన సమాజ చరిత్రలో ఈ ఆత్మగౌరవ సభ మరో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు.