Ram Charan Modi Praise | ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి

‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా అభివర్ణించిన మోదీ
కొడుకుకు లభిస్తున్న గుర్తింపు తండ్రిగా గర్వకారణమన్న మెగాస్టార్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నటుడు రామ్ చరణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లభించిన ప్రశంసలపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ‘పెద్ది’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకుని టాప్ ట్రెండింగ్‌లో ఉన్న రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ రామ్ చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించారు. ప్రధాని మోదీ రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్”గా సంబోధించడాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

‘పుత్రోత్సాహం నేడు పొందుతున్నా’
ఈ సందర్భంగా చిరంజీవి సుమతీ శతకంలోని “పుత్రోత్సాహము తండ్రికి…” అనే పద్యాన్ని ఉటంకించారు. కొడుకు జన్మించినప్పుడు కాకుండా, అతడిని సమాజం గుర్తించి ప్రశంసించినప్పుడు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చరణ్ కృషికి దక్కిన గుర్తింపు
రామ్ చరణ్ తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును సంపాదించుకున్నారని చిరంజీవి అన్నారు. ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరగాలి
రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.