Van Accident | 10 మందికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Van Accident | 10 మందికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Van Accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో హజ్ యాత్రికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. జనకిపురం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పది మంది తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నై నుంచి వీకలత్తూరుకు హజ్ యాత్రికులు, వారి బంధువులతో కలిసి ఒక వ్యాన్ బయల్దేరింది. జనకిపురం సమీపానికి చేరుకున్న సమయంలో వ్యాన్ ముందు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వ్యాన్ రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన పది మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. టైరు పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమని అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
