డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి బాధ్యత: ఎస్పీ సంకీర్త్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం” అనే సందేశంతో నిర్వహించిన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం, కుటుంబాలు మరియు సమాజంపై ఏర్పడే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. డ్రగ్స్ రహిత భూపాలపల్లి జిల్లా నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
