సోలార్ ప్లేట్ల సామర్థ్యంలో నిబంధనల చిక్కులు…

సోలార్ ప్లేట్ల సామర్థ్యంలో నిబంధనల చిక్కులు…

– వినియోగదారులపై అదనపు భారం?

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ విద్యుత్ పథకం వినియోగదారులకు సంపద సృష్టి గా మారుతుందని ఆశించినా, క్షేత్రస్థాయిలో సాంకేతిక నిబంధనలు, అవగాహన లోపం వల్ల వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 3 కెవి సోలార్ యూనిట్ల ఏర్పాటు విషయంలో అదనపు లోడ్ బాదుడుపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం 3 కెవి సోలార్ ప్లేట్లు బిగించుకోవాలని సూచిస్తున్నప్పటికీ, సాంకేతికంగా వాటి కెపాసిటీ ఖచ్చితంగా 3 కెవి ఉండదు. ఇవి 3.6 లేదా 3.7 కెవి వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

3 కెవి సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ముందస్తుగా తమ విద్యుత్ కనెక్షన్ లోడ్‌ను 4 కెవి వరకు పెంచుకోవాలని అధికారులు ముందుగా స్పష్టమైన ప్రకటన చేయలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తొలుత ప్రకటించిన విధంగా 3 కెవి లోడ్ ఉన్న వారికే 3 కెవి సోలార్ అని నమ్మి వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారు. తీరా బిగించే సమయంలో సాంకేతిక సామర్థ్యం పెరుగుతుందనే సాకుతో లోడ్ పెంచుకోవాలని చెప్పడం, అందుకు అదనపు రుసుము వసూలు చేయడం వినియోగదారులపై భారంగా మారింది.

ముందుగా సరైన అవగాహన కల్పించకుండా, ఇప్పుడు అదనపు లోడ్ పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టడం సరికాదని బాధితులు పేర్కొంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖాధికారులు స్పందించి, ప్రకటనల్లో ఉన్న నిబంధనలకు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయాలని కోరుతున్నారు.

Leave a Reply