గ్రామం నుంచి గ్లోబల్ వేదిక వరకు…

అమరావతి ఛాంపియన్‌షిప్-2.0’తో క్రీడా విప్లవం..
ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక క్రీడాకారుడే లక్ష్యం..
జూలై 15 నుంచి క్రీడా పోటీలు ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభం
అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాలు…
మూడు దశల్లో కీలక రాష్ట్రస్థాయి పోటీలు
3 లక్షల మంది యువ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తాం..
విజేతలకు రూ.94 లక్షల నగదు ప్రోత్సాహకాలు
క్రీడలను ప్రతి విద్యార్థి జీవితంలో భాగం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం…
పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల సమన్వయంతో నిర్వహణ..
కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు ముందస్తు ఆర్థిక సాయం..
అందించిన తొలి ప్రభుత్వం ఇదే…
ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతల సత్కారం…
ఉత్తమ కోచ్‌లు, డీఎస్‌డీఓలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు..
అమరావతి ఛాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరణ…

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలకు చేర్చాలనే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్‌షిప్-2.0 ను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. గత ఏడాది విజయవంతమైన తొలి ఎడిషన్‌కు కొనసాగింపుగా ఈసారి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మూడు దశల్లో పోటీలను నిర్వహిస్తూ క్రీడలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

విజయవాడలో ని శాప్ కార్యాలయంలోఅమరావతి ఛాంపియన్‌షిప్-2.0 పోస్టర్‌ను ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, శాప్ ఎండీ భరణి తదితరులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవినాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రీడాశాఖ మంత్రి ఎం. రామప్రసాద్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో….

జూలై 15 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి ఎంపికలు, ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయి తుది పోటీలు నిర్వహించనున్నట్లు శాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పారు. ఈసారి గత ఏడాదితో పోలిస్తే పోటీలను మరింత విస్తరించి అండర్-17, అండర్-23 విభాగాల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా సహా 12 క్రీడాంశాలను చేర్చినట్లు వివరించారు. ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మంది యువ క్రీడాకారులను భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో సుమారు 1.97 లక్షల మంది, జిల్లా స్థాయిలో 98 వేల మంది, రాష్ట్రస్థాయిలో 14 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. విజేతలకు మొత్తం రూ.94 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడలకు కొత్త ఊపు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవినాయుడు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో పాల్గొనేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆదేశించారని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, యువజన సేవల శాఖ, స్పోర్ట్స్ అథారిటీ సంయుక్తంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

క్రీడాకారులకు ఆర్థిక సహాయం…

కామన్‌వెల్త్, ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు పోటీలకు ముందుగానే రూ.2.35 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించి వారి శిక్షణకు ప్రభుత్వం తోడ్పాటు అందించిందని చెప్పారు. పతకాలు సాధించిన తర్వాత మాత్రమే కాదు, పతకాలు సాధించే స్థాయికి చేరుకునే ముందే ప్రోత్సహించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత అని శాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అమరావతి ఛాంపియన్‌షిప్ విజేతలకు ఘన సత్కారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలోని ఉత్తమ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారులు (డీఎస్‌డీఓలు), ప్రతిభ కనబరిచిన కోచ్‌లకు ప్రత్యేక అవార్డులు అందజేసి సన్మానించనున్నట్లు వెల్లడించారు.

స్పోర్ట్స్ ఫెస్టివల్ గా…..

శాప్ ఎండీ భరణి మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా నిజమైన స్పోర్ట్స్ ఫెస్టివల్ గా మారాలని ఆకాంక్షించారు.

ప్రతిభను వెలికి తీసే వేదిక….

అంతర్జాతీయ చదరంగ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుత అవకాశంగా అమరావతి ఛాంపియన్‌షిప్ నిలుస్తుందని, గెలుపోటముల కంటే పాల్గొనడం, అనుభవం సంపాదించడం ముఖ్యమని యువ క్రీడాకారులకు సూచించారు. క్రీడలు ఆరోగ్యవంతమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాజ నిర్మాణానికి బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.