28thaprilchintana | స్వర్గం, నరకం అసలు అర్థం

28thaprilchintana | స్వర్గం, నరకం అసలు అర్థం

28thaprilchintana | మహాభారతంలో స్వర్గనరకాల సందేశం
పాపం, పుణ్యం – ఫలితాల వెనుక నిజం
మనిషి జీవితం లో నైతికత ప్రాముఖ్యత

28thaprilchintana | పురాణేతిహాసాల్లో స్వర్గనరకాల ప్రస్తావనలో, ఈ స్వర్గనరకాలను చూసినవాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు ఎలాంటి అనుభూతి పొందారు? అనేది ఆసక్తికరమైన విషయం. దీనికి సమాధానాన్ని మహాభారతంలోని చిట్టచివరి స్వర్గారోహణ పర్వంలో తెలుసుకోవచ్చు. పాండవుల మహాప్రస్థానంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది మార్గమధ్యంలోనే తనువులు చాలించారు. తన వెంట వచ్చిన ఒక కుక్కతో ధర్మరాజు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

ధర్మరాజు స్వర్గంలోకి అడుగుపెట్టగానే అక్కడ దుర్యోధనుడు కనిపించాడు. ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎన్నో పాపాలు చేసి, అధర్మంగా యుద్ధానికి తలపడిన దుర్యోధనుడికి స్వర్గం ఎలా లభించిందని అక్కడే ఉన్న నారదుణ్ని అడిగాడు. దుర్యోధనుడు యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించాడు కనుక అతడికి స్వర్గం లభించిందని నారదుడు చెప్పాడు. ఆ మాటకు నిశ్చేష్టుడైన ధర్మరాజు తన సోదరులు, భార్య, ఇతర ధర్మవీరులు ఉన్న చోటుకు తనను తీసుకెళ్లమని దేవదూతను కోరాడు.

దేవదూత ధర్మరాజును తన వెంట పెట్టుకుని బయలుదేరాడు. దారి అంతా భయంకరంగా, చీకటిగా, అగ్నిజ్వాలలతో నిండి ఉంది. అక్కడి దుర్గంధంను సహించలేక ధర్మరాజు వెనుదిరగబోయాడు. అంతలో కొందరి హాహాకారాలు వినిపించాయి. ధర్మరాజు ఆశ్చర్యంతో “మీరంతా ఎవరు? నన్నెందుకు నిలువమంటున్నారు?” అని అడిగాడు. అప్పుడు “ప్రభూ! నేను భీముణ్ని, నేను కర్ణుణ్ని, నేను అర్జునుణ్ని, నేను నకులుణ్ని, నేను సహదేవుణ్ని, నేను ద్రౌపదిని, మేము ద్రౌపదీపుత్రులం” అనే మాటలు వినిపించాయి. ఇది విని ధర్మరాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం దేవదూత ఇంద్రుడికి తెలియజేశాడు. ఇంద్రుడు స్వయంగా వచ్చి ధర్మరాజును కలిశాడు.

అప్పుడు ధర్మరాజు ఇంద్రుడిని అడిగాడు: “ధర్మాత్ములైన నా సహోదరులు, నా భార్య నరకంలో అగచాట్లు పడటం ఏమిటి? దుష్టుడు, పాపాత్ముడైన దుర్యోధనుడు స్వర్గంలో ఉండటం ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్పాడు: “నాయనా ధర్మజా! ఎక్కువగా పాపాలు చేసి, తక్కువగా పుణ్యాలు చేసినవారు మరణానంతరం మొదట పుణ్యఫలంగా స్వర్గానికి చేరి, ఆ తరువాత నరకానికి వెళ్తారు. ఎక్కువ పుణ్యాలు చేసి, తక్కువ పాపాలు చేసినవారు మొదట నరకంలో పాపఫలాన్ని అనుభవించి, ఆ తరువాత స్వర్గానికి చేరుకుంటారు. నీవు కూడా ‘అశ్వత్థామ హతః కుంజరః’ అనే చిన్న అబద్ధం చెప్పినందుకు నరకాన్ని దర్శించవలసి వచ్చింది” అని తెలిపాడు.

సుకృతాలను ఎక్కువగా చేసి, అందరికీ మేలుచేయాలనే తలంపుతోనే స్వర్గనరకాల భావనలను చెప్పారు అనే పరమార్థంను గ్రహించాలి. తప్పు చేసినవారికి మనశ్శాంతి కరువై, దుఃఖం కలుగుతుంది. దుఃఖం వల్ల జీవితం అల్లకల్లోలం అవుతుంది. కనుక మనిషి పుణ్యకార్యాలే చేయాలి. పురాణేతిహాసాలు మానవుల్లో నైతికతను పెంపొందించేందుకు దోహదపడుతున్నాయి. మనిషి ఎప్పుడూ తనలోని అజ్ఞానాన్ని తానే గ్రహించలేడు. అందుకే అతడికి నచ్చే విధంగా నీతికథల రూపంలో ప్రాచీన సాహిత్యం మార్గనిర్దేశనం చేసింది. స్వర్గనరకాలు ఎక్కడో పైలోకాల్లో లేవు; అవి మనుషుల కళ్లెదుటే కనిపిస్తాయి. మంచి పనులు చేసి ఆత్మతృప్తి పొందుతూ, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినవారిని చూసినప్పుడు పుణ్యఫలం ఎంత మధురమో అర్థమవుతుంది.

కామిడి సతీష్ రెడ్డి
9848445134

Leave a Reply