26thaprilsplstory | యుద్ధాలు ప్రపంచ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం

26thaprilsplstory | యుద్ధాలు ప్రపంచ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం

26thaprilsplstory | ప్రపంచ యుద్ధాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై
అమెరికా ఆధిపత్యం మరియు అంతర్జాతీయ రాజకీయాలు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం
గ్లోబల్ ఎకానమీ లో మారుతున్న శక్తి సమీకరణాలు
యుద్ధాలకంటే చర్చలే శాశ్వత పరిష్కారం
వికసిత భారత్‌కు అవసరమైన ఆర్థిక మార్గదర్శకం

26thaprilsplstory | ఒక చిన్న గొడవ ఒక కుటుంబ వినాశనానికి ఎలా కారణమవుతుందో, అదే విధంగా ప్రపంచంలోని ఏ దేశాల మధ్య ఉద్రిక్తతలు లేదా యుద్ధం సంభవించినా మొత్తం ప్రపంచ దేశాలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్నీ ఒకదానితో మరొకటి ఆధారపడి ఉంటున్నాయి. ఎక్కడ పరిస్థితి మారినా ‘సప్లై చైన్‌’ దెబ్బతింటుంది. కరోనా సమయంలో మొత్తం ప్రపంచ దేశాలు అన్నీ ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొన్న దుస్థితిని మనం కళ్లారా చూశాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

కొంచెం కోలుకుంటున్న సమయంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా గాజా యుద్ధం, తదుపరి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇక తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా చర్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని రకాలుగా భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. దీనికి అంతటికీ ఒక ప్రధాన కారణం అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణి అని భావిస్తున్నారు.

ఇప్పటికే చైనా, రష్యా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, డాలర్‌కు ధీటుగా అమెరికాకు సవాల్‌ విసురుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. చమురు, గ్యాస్‌, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ వంటి అంశాల్లో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూబుల్‌, యువాన్‌ మరియు ఇతర దేశాల స్థానిక కరెన్సీలలో ఎగుమతి-దిగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు మన భారతదేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా రష్యా, చైనా, భారత్‌ వంటి దేశాలు ఒకటిగా నిలవడం అమెరికాకు అసౌకర్యంగా మారింది.

ఇప్పటికే అదనపు సుంకాలు విధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో విభేదాలకు దిగిన అమెరికా, డాలర్‌ ఆధిపత్యం తగ్గిపోకూడదనే ఉద్దేశంతో చమురు నిల్వలు ఉన్న దేశాలపై ఒత్తిడి తెస్తోందని విమర్శలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు సహకరిస్తూ పాలస్తీనా గాజా, ఇరాన్‌, లెబనాన్‌ వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడానికి దారితీస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు చమురు, గ్యాస్‌ సంక్షోభానికి దారి తీస్తూ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశానికి ఇది పెద్ద సవాలుగా మారింది. మన దేశం దాదాపు 90 శాతం చమురు, గ్యాస్‌ అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. వీటిలో అధిక భాగం హోర్ముజ్‌ జలసంధి మార్గం ద్వారానే వస్తుంది.

ఇటువంటి పరిస్థితుల్లో మన ఆర్థిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. భారత్‌ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రతి సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 10 శాతం పైగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సుమారు 5.9 శాతం వద్దనే ఉండే అవకాశముందని వివిధ సర్వేలు సూచిస్తున్నాయి. రూపాయి విలువ కూడా తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం, అధిక ధరలు ప్రజలపై భారంగా మారుతున్నాయి. మొత్తం దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది.

ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌, రష్యా, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలు, అలాగే నాటో, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు అమెరికా ఏకపక్ష విధానాలకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇరాన్‌ విషయంలో అమెరికాను ఒంటరిచేసే ప్రయత్నం చేయడం ఒక శుభపరిణామం.

ప్రపంచంలో అన్ని దేశాలు సమానంగా అభివృద్ధి సాధించాలి. మానవ హక్కులు కాపాడాలి. నియంతృత్వ, ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేయాలి. యుద్ధాల ద్వారా వినాశనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని గ్రహించాలి.

ముఖ్యంగా మన దేశ పాలకులు కూడా చైనా, రష్యా వంటి దేశాల మాదిరిగా స్పష్టమైన విధానాలను ప్రకటించాలి. మౌనంగా ఉండటం లాభదాయకం కాదు. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించేందుకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి. ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలి.

వికసిత భారత్‌ సాధించాలంటే అనుత్పాదక వ్యయాలను తగ్గించి, ఓటు బ్యాంకు రాజకీయాలను తగ్గించి, సంక్షేమ పథకాలను నిజంగా అర్హులైన వారికి మాత్రమే అందించాలి. విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి, ఉద్యోగావకాశాలు పెంచడం ద్వారా మాత్రమే వికసిత భారత్‌ లక్ష్యం సాధ్యమవుతుంది.

  • ఐ. ప్రసాదరావు
    6305682733

Leave a Reply