23wards | తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్
23wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు
23wards | అభ్యర్థులను నట్టేట ముంచిన లీడర్
23wards | పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ హడావిడి ఫలించలేదా?
ఆర్థిక హామీలు ఇచ్చి చివరికి చేతులెత్తేసిన నాయకుడు
సింహం గుర్తుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల నిరాశ
రాజకీయ లెక్కల్లో మార్పులు.. కాంగ్రెస్ ఖాతాలోకి పెద్దపల్లి?
ఆంధ్రప్రభ, పెద్దపల్లి రూరల్ : గర్జిస్తున్న సింహం తోక ముడిచింది… ముందుండి నడిపించాల్సిన లీడర్ స్వార్థం తో తన గెలుపు కోసం తన వారి కోసమే పరిమితమయ్యాడు.
అన్ని నేనే చూసుకుంటా.. పాంప్లెట్ల నుండి పోల్ మేనేజ్మెంట్ వరకు నాదే బాధ్యత అంటూ ఊరించాడు..
అన్ని పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారందరినీ ఒక గూటికి చేర్చి మీ గెలుపు బాధ్యత నాదే అంటూ ఊరించి ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయించాడు..
పోలింగ్ సమయం ముంచుకొస్తున్న ఇప్పటివరకు ఇచ్చిన మాట పై నిలబడకపోవడంతో పాటు కనీసం ఏమైంది అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటాడు అనుకున్న లీడర్ చేతులెత్తేయడంతో లబోదిబోమంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టినా మూడు నెలల సమయం పట్టి అవకాశాలు ఉండడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ తో జత కలిసి మున్సిపల్ ఎన్నికల్లో తన మార్కు చాటాలని భావించారు. పెద్దపల్లి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే జనరల్ ఎలక్షన్ లో తాను పెద్దపల్లి నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందో పరీక్షించాలనుకున్నారు. కచ్చితంగా తన మార్కు చాటాలని వ్యూహాలు రచించారు.
కచ్చితంగా సత్తా చాటే ప్రయత్నాల్లో భాగంగా పెద్దపల్లి నుండి ఓ నాయకుడు కవితను సంప్రదించి పెద్దపల్లి మున్సిపల్ బాధ్యతలు తాను తీసుకుంటానని, ఆర్థికంగా తనకు కొదవలేదని అభ్యర్థుల భారం అంతా తానే మోస్తానని మాయ మాటలు చెప్పి మొత్తం బీఫాం లు తెచ్చుకున్నాడు.. ఇంకేముంది పెద్దపల్లి మున్సిపల్ లో సత్తా చాటుదామని నమ్మి మొత్తం బీఫాంలో సదరు లీడర్ చేతికి ఇచ్చారు. 36 వార్డుల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తాడని భావించగా కేవలం 23 వార్డులకే అభ్యర్థులకు బి ఫాం లు అందజేశాడు. గోడపత్రికలు, స్టిక్కర్లు, పాంప్లెట్లు ఇలా అన్ని తానే ఇస్తానని అభ్యర్థుల దగ్గర నమ్మబలికాడు.
ఇంకేముంది వార్డుల్లో తమకు వ్యక్తిగత బలం ఉంది మిగతా విషయాలన్నీ సదరు నాయకుడు చూసుకుంటాడని అభ్యర్థులు రంగంలోకి దూకారు. నామినేషన్లు వేశారు.. హంగు ఆర్భాటంతో ప్రచారం మొదలుపెట్టారు.. ప్రజలు కూడా కొంతమేర ఆదరించారు. ఇంకేముంది పోల్ మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుంది తమ గెలుపు పక్కా అని భావించారు.. ఇక్కడే అసలు కథ మొదలైంది. హామీ ఇచ్చిన నాయకుడు ముఖం చాటేసి తాను పోటీ చేస్తున్న వార్డుతో పాటు తన రక్తసంబంధీకులు పోటీ చేస్తున్న రెండు వార్డులపైనే ఫోకస్ పెట్టాడు.

మిగతా వార్డులను గాలికి వదిలేసాడు. సామాగ్రి పంపిణీ చేయకపోయినా తమ సొంత ఖర్చులతో ముద్రించి ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. పోలింగ్ కు మూడు రోజులు ముందు అన్ని వాడలకు కావలసిన మందు, ఆర్థిక వనరులు సమకూరుస్తామని చెప్పి మాట తప్పాడు. పోల్ మేనేజ్మెంట్ కు కావలసిన వనరులు వస్తాయని ఏర్పాట్లు చేసుకోని అభ్యర్థులు బాధ్యత తీసుకున్న లీడర్ మాట తప్పడంతో లబోదిమంటున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో సదరు లీడర్ మొదట చేసిన హడావిడి కి ఫార్వర్డ్ బ్లాక్ డబుల్ డిజిట్ కు చేరుతుందని విశ్లేషకులు భావించారు.
ఆదుకుంటాడనుకున్న లీడర్ అభ్యర్థులను మోసం చేయడంతో ఫార్వర్డ్ బ్లాక్ పరిమిత స్థానాలకే పరిమితమవుతుందని, సదరు నాయకుడు పోటీ చేస్తున్న వాటితో పాటు ఆయన బంధువులు పోటీ చేస్తున్న వార్డుల్లో సైతం ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో గర్జిస్తుందనుకున్న సింహం తోక ముడిచిందని విశ్లేషకులు తాజా అంచనాకు వచ్చారు. దీంతో పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందని గంటాపతంగా చెబుతున్నారు.ప్రతికూలం
బిఆర్ఎస్ లో చేరెందుకు వెళ్తే చీ కొట్టారు
సింహం గుర్తుపై పోటీ చేస్తూ పెద్దపల్లిలో హడావిడి చేస్తున్న సదరు నాయకుడు మొదట బిఆర్ఎస్ లో చేరెందుకు నానా తంటాలు పడ్డా ఆ పార్టీ అధినాయకత్వం ఛీ కొట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కవిత వద్దకు చేరి సింహం గుర్తు బి ఫామ్ లు దక్కించుకున్నాడు. సదరు లీడర్ పెద్దపల్లి జిల్లాలో కారు గుర్తుకు సంబంధించిన పలువురు నాయకులను సంప్రదించి పెద్దపల్లి మున్సిపల్ బాధ్యత అప్పగించాలని అంతా తానే చూసుకుంటానని హడావిడి చేయడంతో సదరు నాయకులు కొంతమేర ప్రయత్నం చేసినా ఎందుకో వెనుకడుగు వేశారు. కరీంనగర్ కు చెందిన ఓ నాయకుడికి ఆర్థిక వనరుల ఆశ చూపి గులాబీ గూటిలో చేర్పించాలని తీవ్రంగా ప్రయత్నించి హైదరాబాద్ వరకు వెళ్లినా అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పొంతన చేరాడు.
ఇప్పుడు చైర్మన్.. ఆ తర్వాత ఎమ్మెల్యే అంటూ హడావిడి
ప్రస్తుతం సింహం గుర్తుపై పోటీ చేసి చైర్మన్ అవుతా.. ఆ తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతా అంటూ సదరు నాయకుడి గత కొన్ని రోజులుగా పెద్దపల్లిలో హడావిడి చేశాడు. దీంతో పెద్దపల్లిలో రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతాయ అని ప్రజలు తొలత భావించారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది సింహం గుర్తు అభ్యర్థులను సదరు నాయకుడు నట్టెట్లో ముంచడంతో నాలుగు రోజుల హడావిడి మాత్రమే అని ప్రజలు చర్చించుకుంటున్నారు
ఎట్టకేలకు ఎటూ వెళ్ళలేక లోలోపల కుమిలిన అభ్యర్థులు కాస్తా అప్పో సప్పో చేసి తెచ్చుకున్న మొత్తాన్ని ఎన్నికల్లో కుమ్మరించి ప్రచారం అయిందనిపించారు. ఇన్ని టెన్షన్ లను తట్టుకుని పోటీ చేసిన అభ్యర్థులందరూ ఇప్పుడు ఫలితాల కోసం ఆశగా..ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
