21aprilcartoonstory | ట్రంప్ ముందూ వెనకా నుయ్యే…

21aprilcartoonstory | ట్రంప్ ముందూ వెనకా నుయ్యే…
21aprilcartoonstory | శాంతి లేదు, చర్చలకు రామంటున్న ఇరాన్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మేం బాంబులేస్తే భయపడాలి…శాంతిస్తే ఊపిరి పీల్చుకోవాలి…ప్రాణభిక్ష పెడితే బతికి బట్టకట్టాలి… ఇదీ అగ్రరాజ్యం అధ్యక్షుడు Donald Trump వైఖరి. కన్ను పడిన దేశాలను భయపెట్టడం…వణికించుకోవడం…దారికి తెచ్చుకోవడం… అమెరికాను పరిపాలించడం సంగతి దేవుడెరుగు…ప్రపంచ దేశాలపై కొరడాతో బాదుతూ దండయాత్ర చేయడమే నిత్యకృత్యమైపోయిందని సాక్షాత్తూ అమెరికన్లే అతడి పరిపాలనపై పెదవి విరుస్తున్నారు. అతడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఆగ్రహజ్వాలలు రేకెత్తుతున్నా అణువంతైనా వెనక్కి తగ్గడంలేదు.
నాకు బెదురు లేదు…నా మాటకు ఎదురు లేదు అంటూ సుంకాలతో విరుచుకు పడిన ట్రంప్ దూకుడికి కళ్ళెం వేసింది అక్కడి సుప్రీం కోర్టు. కట్టించుకున్న సుంకాలనన్నిటినీ తిరిగిచ్చేయాల్సిందేనని తీర్పునివ్వడంతో, తిరిగి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించక తప్పలేదు.
ఇక Iran తో యుద్ధం విషయానికొస్తే, రెచ్చిపోయి కదన రంగంలోకి దూకి, బాంబుల వర్షం కురిపించినా, ఆ దేశం మాత్రం కించిత్తు భయపడడం లేదు. ఇప్పుడు ట్రంపు పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి కాదు, ముందూ వెనకా పెద్ద నుయ్యే అన్నట్టు తయారైంది. ఎందుకంటే, ఆల్రెడీ కాల్పుర విరమణ ప్రకటించడం తానే.. మళ్లీ రోజుకో బెదిరింపులు చేస్తున్నదీ తానే. శాంతి చర్చలంటూ పిలుస్తున్నదీ తానే చేస్తున్నాడు. ఇరాన్ మాత్రం, శాంతి లేదు, చర్చలకు రామంటూ కరాఖండీగా మొహమ్మీదే చెప్పేసింది.
మొదలెట్టింది తానే అయినప్పుడు, ఎదుటివారు సంధికి, రాజీకి రానప్పుడు తాను మాత్రం ఎలా ఆపగలడు యుద్ధాన్ని? యుద్ధం కూడా బావి లాంటిదే. ఒక్కసారి దూకాక, ఎన్ని మీటర్లా లోతైనా పడిపోవాల్సిందే. మధ్యలో ఆగిపోవడాలూ…ఆపేయడాలూ ఉండవ్… ఈ కఠోర సత్యం ట్రంపుకి ఇప్పుడిప్పుడే అర్థమైనట్టే ఉండొచ్చు కానీ, ఆగలేడు..ఆపలేడు… ఎకరక్కపోయి దూకాడు…ఎక్కడ పడతాడో ఏమో…
— మాధవ్
