20special stalls | తిరుపతిలో కూటమి శక్తి ప్రదర్శన

20special stalls | తిరుపతిలో కూటమి శక్తి ప్రదర్శన

కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల ప్ర‌గ‌తిపై విజ‌యోత్స‌వ స‌భ‌
మూడు సభలకు బదులు ఒక్క మహాసభ.. దామినేడు వద్ద భారీ ఏర్పాట్లు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హాజరు
30 వేల మందికి పైగా ప్రజలు, లబ్ధిదారులు తరలివచ్చే అవకాశం
తిరుప‌తి రూర‌ల్ ప‌రిధిలోని దామినేడు ద‌గ్గ‌ర 20 ఎక‌రాల్లో భారీ ఏర్పాట్లు
విశాఖ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో వాయిదా ప‌డి.. రేపు జ‌ర‌గ‌నున్న తెలుగు స‌భ‌
స‌భ‌కు హాజ‌రుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ ఏపీ చీఫ్‌
ప్ర‌భుత్వ రెండేళ్ల ప్ర‌గ‌తిని వివ‌రించేలా స‌భా ప్రాంగ‌ణంలో 20 స్టాల్స్‌
భ‌ద్ర‌త కోసం 2వేల మంది పోలీసులు, ప‌ర్య‌వేక్షిస్తున్న క‌లెక్ట‌ర్‌, ఎస్పీ

20special stalls | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న రేపు (శుక్ర‌వారం) విజయోత్సవ సభకు తిరుపతి వేదికగా మారుతోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, సుపరిపాలన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం, తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని ఒకే సభకు పరిమితం చేసింది. దీంతో తిరుపతిలో జరిగే ఈ బహిరంగ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు నివేదిక అందించేందుకు శుక్రవారం తిరుపతి రూరల్ మండలం దామినేడు సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి, వేలాదిమంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రితో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.

ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పాలనాపరమైన సంస్కరణలను ప్రజలకు వివరించేలా సభా ప్రాంగణంలో 20 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ శాఖల పనితీరును ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు.

మొదటగా ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖపట్నంలో అభివృద్ధిపై మూడు వేర్వేరు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విశాఖ‌ప‌ట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సభను వాయిదా వేసి, అనంతరం అమరావతి, విశాఖపట్నం సభలను రద్దు చేశారు. మూడు సభలకు బదులుగా తిరుపతిలోనే ఒకే భారీ విజయోత్సవ సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత అక్కడ రాజకీయ సభ నిర్వహించడం సముచితం కాదని భావించిన ప్రభుత్వం, కూటమి నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతి సభే ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రధాన వేదికగా మారింది. సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూటమి శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో 30 వేల మందికి పైగా జనసమీకరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించగా, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Leave a Reply