APLiquorScam | హైదరాబాద్‌లో పలుచోట్ల సోదాలు..
APLiquorScam | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఆరుగురు నిందితులకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా భారీ మొత్తంలో నిధుల బదిలీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.
సోదాల సందర్భంగా కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లభించిన ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఈడీ భావిస్తోంది. ఈ కేసు ఇప్పటికే రాజకీయంగా సంచలనం సృష్టించగా, తాజా సోదాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
