పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి

పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి

  • ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పారదర్శక విచారణ జరపాలి
  • దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన
  • రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : పోలీస్ అధికారులు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై అత్యంత పారదర్శకంగా విచారణ నిర్వహించి, బాధితులకు నమ్మకం, భరోసా కల్పిస్తూ అండగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల జోన్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రిసెప్షన్, ఐటీ విభాగం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించి, వారి విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ రికార్డులను, పెండింగ్ కేసుల వివరాలను సీపీ నిశితంగా పరిశీలించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ (అప్‌డేట్ చేస్తూ), ఎలాంటి పెండింగ్ లేకుండా పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే స్టేషన్ నిర్వహణ తీరును సమీక్షించి, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, స్టేషన్‌కు వచ్చే బాధితులు, ప్రజలకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, స్థానిక ప్రజలతో మమేకమై శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవాలని సీపీ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ వెంట ఉంచుకోవాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్‌ఐ గంగారాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply