194years | ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి.. రికార్డులకెక్కింది
194years | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సాధరణంగా తాబేళ్లు 50 నుంచి 150 సంవత్పరాలు జీవిస్తాయి. కానీ ‘జోనాథన్’ అనే తాబేలు ప్రస్తుతం 194 ఏటా అడుగు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాదండోయ్… ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. జోనాథన్ను ఒక ‘ఐకాన్’ (ICON) గా కూడా గౌరవించింది.
అయితే సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ జాతి తాబేళ్లు సుమారు 150 ఏళ్లు జీవిస్తాయి. కానీ జోనాథన్ అంతకంటే ఎక్కువ కాలం జీవించి రికార్డు సృష్టించింది. ఈ తాబేలు సుమారు 1832లో జన్మించినట్లు భావిస్తున్నారు. 1882 నుండి సెయింట్ హెలీనాలోని గవర్నర్ అధికారిక నివాసమైన ‘ప్లాంటేషన్ హౌస్’ (Plantation House) లో ఉన్నట్లు సమాచారం.
పురాతన కట్టడాలకంటే కూడా..
జోనాథన్ వయసు ఐఫిల్ టవర్, లండన్ టవర్ బ్రిడ్జ్ వంటి ప్రసిద్ధ కట్టడాల కంటే కూడా పెద్దది. వయస్సు పెరగడంతో ఇది చూపు, వాసన చూసే శక్తిని కోల్పోయింది. కానీ దీని ఆరోగ్యం చాలా బాగుందని అక్కడి పశువైద్యులు ధృవీకరించారు. ఇది ఇంకా రోజంతా ఉత్సాహంగా తిరుగుతూ.. గడ్డిని తింటూ, ఎండలో సేదతీరుతూ ఉంటుంది.
ఇలాంటి రికార్డులు సృష్టించిన మరికొన్ని జీవులు..
అద్వైత (Adwaita) – ఈ తాబేలు ఒక ‘అల్దాబ్రా జెయింట్ తాబేలు’. భారతదేశంలోని కోల్‌కతాలో ఉన్న ‘అలీపూర్ జూలాజికల్ గార్డెన్స్’లో ఉండేది. ఇది దాదాపు 255 ఏళ్లు జీవించిందని అంచనా. 2006లో ఇది చనిపోయింది.
హనకో (Hanako) – కోయి చేప జపాన్‌కు చెందిన ఈ చేప దాదాపు 226 ఏళ్లు జీవించింది. ఇది 1977లో మరణించింది. దీని పొలుసులను పరీక్షించిన శాస్త్రవేత్తలు దీని వయస్సును నిర్ధారించారు.
మింగ్ (Ming) – ఓషన్ క్వాహోగ్ క్లామ్ (Ocean Quahog Clam) ఇది ఒక రకమైన సముద్రపు నత్త వంటి జీవి. ఐస్లాండ్ తీరంలో దొరికిన ఈ జీవి 507 ఏళ్లు జీవించి రికార్డు సృష్టించింది. ఇది 2006లో శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది.
