18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?

18aprilchintana | ధర్మం ఎందుకు క్షీణిస్తోంది?

18aprilchintana | కలియుగ లక్షణాలు మరియు మానవ ప్రవర్తన
మార్పు కోసం ఆధ్యాత్మిక మార్గం
కల్కి అవతారం: భవిష్యత్తు సందేశం

18aprilchintana | మనకు పద్మపురాణం, విష్ణు పురాణము, శివ పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి అష్టాదశ పురాణములు మాత్రమే తెలుసు. కానీ ఈ కలియుగ పురాణం ఏమిటి? అని ఆలోచన రావచ్చు! సర్వశక్తిమంతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడైన శ్రీ కృష్ణుడు తన అవతార సమాప్తి చేసి, పరంధామం చేరినప్పుడు, ”కలిపురుషుడు” భూలోకంలో ప్రవేశించాడు. అప్పటినుండే మానవుల బుద్ధులు, ప్రవర్తనలు పాపభూయిష్ఠమైపోయాయి. కలియుగంలో, కాల ప్రభావంలో ప్రజల్లో అధర్మం-అసత్యం, అసహనం, అపవిత్రత చోటు చేసుకొంటున్నాయి. హత్యలు-ఆత్మహత్యలుకు భయమే ఉండదు. వివాహ సంబంధ విషయాల్లో కులము, శీలము, యోగ్యత, కుటుంబ సాంప్రదాయాలు అక్కర్లేకపోతూ ఉంటాయి. వర్ణసంక్రమణానికి దారితీస్తుంది. అసలైన పండితులకు గౌరవం ఉండదు. పండిత వేషధారణలో ఉన్న వారికి, అధిక ప్రసంగం చేసేవారికి, విలువ ఇస్తారు. వర్ణాశ్రమ ఆచారాలు, వైదిక ధర్మాలు పూర్తిగా అడుగంటి పోతాయి. పాలకులే దోపిడీ దొంగలుగా అవుతారు. పురుషార్థాల సాధన ఉండదు. నిరపరాధులు శిక్షలకు గురవుతారు.

18thaprilchintana
18thaprilchintana

”పరాపవాద నిరా: పర ద్రవ్యాభిలాషిణ: పరస్త్రీ మనస:, పరహంసా పరాయణ:” ఈ శ్లోకంలో నాలుగు చోట్ల ”పర” అనే పదం వచ్చింది. అంటే పరులపై నిందలువేస్తూ, ఆ నిందలే కాలక్షేపానికి ప్రచారంచేస్తూ, పర ద్రవ్యములమీద, పరస్త్రీల మీద వ్యామోహం కలిగి ఉంటారు. ఇది కలియుగ ప్రధాన దోషం. పండిత విప్రులు లోభం అనే అంశానికి లోనై వారు వేద విద్యను కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ముఖ్యం. త్రికాల సంధ్యావందనం, బ్రహ్మ జ్ఞానం వదిలి పెడతారు.

” స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టాభర్త్ర వజ్ఞాన కారికా:” అనే వేద వాక్యం ప్రకారం, స్త్రీలు ఎక్కువగా భ్రష్ఠుపట్టిపోతారు. భర్తలను అవమానించడం, వదిలిపెట్టడం, వంటివి చేస్తూంటారు. అధర్మంగా ప్రవర్తించడంలో తెగింపు ఎక్కువ. రోజురోజుకూ ధర్మం, శౌచం, సత్యం, క్షమ వంటి సద్గుణాలు క్షీణించిపోతాయి. స్వార్థం పెరుగుతుంది. అహంకారం, డాంబికం పెరుగుతాయి. దేవతల ఆస్తులు, ద్రవ్యాన్ని అపహరించడానికి వెనుకాడరు. తల్లితండ్రులు పట్ల, గురువుల పట్ల గౌరవభావమే నశించిపోతుంది. ఎక్కడా అభిమానం, ప్రేమ, గౌరవం గోచరించవు. మనకు కలియుగంలో ప్రజల స్థితిగతులను తెలియచేస్తూ పురాణాలు, భాగవతం వంటి అనేక గ్రంథాలు వచ్చాయి.

మనం ఎందుకు మార్పు కోసం ఆలోచించం?
మనం కలియుగంలో మానవ లక్షణాలు తెలుసుకొని ఎందుకు, మారడానికి ప్రయత్నం చేయరు? ఒక విధంగా చెప్పాలంటే అదికూడా మనమీద కలి ప్రభావం వల్లనే. అలాఅని, స్వార్థంతో కాక, ధర్మబుద్ధితో ఆలోచించడం, సత్సంగాలు చేయడం, ఆధ్యాత్మిక అమృతవాహనిలో మన ధర్మాన్ని గుర్తించి, ముందుకు సాగాలి. ఇతరులకు మార్గదర్శిగా ఉండాలి. మన పిల్లలు ప్రవర్తన అనైతికంగా ఉంటే, సరిచేస్తామా? లేదా? అటువంటిది మనమే అన్నీ తెలిసి అనైతికంగా ప్రవర్తించడమేమిటి? నైతికతతో పాటు వివేకాన్ని కలిగి ఉండాలి. భక్తి తత్త్వాన్ని కలిగి ఉండి, జీవిత పరమార్థాల సాధన దిశగా ప్రయత్నాలు చేయాలి. పరీక్షిత్తు మహారాజు శుక మహర్షిని ”మహర్షీ! కలి ప్రభావం వలన మానవులకు మార్పు వస్తుంది అని చెప్పారు. తిరిగి వారిలో సద్గుణాలు కలగాలంటే ఏమిచేయాలో చెప్పండి” అని కోరగా, మహర్షి బదులిస్తూ ”మహారాజా! అన్ని దోషాలకు మూలము అంత:కరణమే. హృదయంలో భగవంతుని దివ్యరూప, గుణ, లీలా విశేషాలు పదిల పరచుకొని ఆరాధిస్తూ ఉంటే, పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అపుడు అతని అంత:కరణ పరిపూర్ణమైన శుద్ధి అవుతుంది.” అని మార్గాన్ని చెప్పారు.

కలియుగ బాధలు ఎప్పడు అంతం అవుతాయి?
కలియుగంలో శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు, సుశీల దంపతులు విష్ణు భక్తులు. వారికి ”కల్కి” అనే పురుషుడు జన్మించి, తెల్లని గుర్రాన్ని అధిరోహించి, పాపాత్ములను దుష్టసంహారం చేస్తాడు. భూ భారం తగ్గిస్తాడు. మళ్ళీ మంచి రోజులు పునరావృతం అవుతాయి అని చెప్పారు. కాబట్టి, మన పరిధిలో ధర్మంగా జీవిస్తూ, పరోపకార బుద్ధితో ఉంటే భగవంతుడే దిగి రాడా! మీ ఇంటికి.

అనంతాత్మకుల రంగారావు

Leave a Reply