ఎంఆర్‌ఈసీడబ్ల్యూలో ఘనంగా 15వ కాన్వొకేషన్ వేడుకలు

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ (ఎంఆర్‌ఈసీడబ్ల్యూ)లో 15వ కాన్వొకేషన్ (గ్రాడ్యుయేషన్ డే) వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థినులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి పట్టాలను అందజేశారు. విద్యలో విశిష్ట ప్రతిభ కనబరిచి కాలేజ్ టాపర్లుగా నిలిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసాపత్రాలను ప్రదానం చేసి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని, అదే స్ఫూర్తితో విద్యార్థినులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన మల్లారెడ్డి, ప్రో-ఛాన్సలర్ శాలిని మహేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, రిజిస్ట్రార్, అధ్యాపక బృందం, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థినుల ఆనందోత్సాహాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.