15-years-dream : క్రికెట్ కుంభమేళ Andhra Prabha Sports Story

15-years-dream : క్రికెట్ కుంభమేళ Andhra Prabha Sports Story

  • 15 ఏళ్ల నిరీక్షణకు తెర
  • మంగళగిరి సిద్ధం
  • ఏపీఎల్ క్లైమాక్స్ మ్యాచ్‌లకు వేదిక..
  • 34 వేల మంది అభిమానులకు వరల్డ్‌క్లాస్ వేదిక..
  • హైటెక్ పిచ్‌లు
  • ఆధునిక డ్రైనేజీ,
  • ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లలు
  • ఏసీ ఏ సెంట్రల్ జోన్ అకాడమీగా రూపాంతరం..
  • భవిష్యత్ క్రికెట్ తారలకు సరికొత్త కేంద్రం
  • క్రీడా రాజధాని దిశలో అమరావతి అడుగులు..
  • రాష్ట్ర క్రికెట్ అభివృద్ధి లో నూతన అధ్యాయం

(ఆంధ్రప్రభ,ఎన్టీఆర్ బ్యూరో )

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో క్రికెట్ కోలాహలం మొదలుకానుంది. దాదాపు పదిహేనేళ్ల నిరీక్షణ, అనేక అడ్డంకులు, వాయిదాల అనంతరం మంగళగిరి సమీపంలోని నవులూరులో నిర్మితమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పోటీ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధమైంది. జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కీలక మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండటంతో రాష్ట్ర క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది.

15-years-dream : సువిశాల స్థలంలో…

మంగళగిరిలో దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ అత్యాధునిక క్రీడా సముదాయం 34 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్ వీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు ఏసీఏ భారీ స్థాయిలో నిధులు వెచ్చించి స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. రాష్ట్ర విభజన తర్వాత క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తోంది. ఈ స్టేడియం ప్రధాన ఆకర్షణ అత్యున్నత నాణ్యతతో రూపొందించిన పిచ్‌లు, విశాలమైన అవుట్‌ఫీల్డ్. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక మట్టితో పిచ్‌లను సిద్ధం చేశారు. వర్షం కురిసినా కొద్ది నిమిషాల్లోనే మైదానం తిరిగి ఆటకు సిద్ధమయ్యేలా అత్యాధునిక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో వర్ష ప్రభావం మ్యాచ్‌లపై తగ్గే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో అంతర్జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాలకు అనుగుణంగా హైడెఫినిషన్ ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు అమర్చారు. దీంతో డే-నైట్ మ్యాచ్‌ల నిర్వహణకు పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

15-years-dream : క్రికెట్ స్టార్ల ఉత్పత్తి కేంద్రం గా…

మంగళగిరి స్టేడియాన్ని కేవలం మ్యాచ్‌ల వేదికగానే కాకుండా ఏసీఏ సెంట్రల్ జోన్ క్రికెట్ అకాడమీగా అభివృద్ధి చేశారు. ఇండోర్ క్రికెట్ అకాడమీలో అత్యాధునిక బౌలింగ్ మెషిన్లు, వీడియో అనాలిసిస్ ల్యాబ్‌లు, సాంకేతిక శిక్షణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. యువ క్రికెటర్ల ప్రతిభను మెరుగుపరచడానికి ఇవి కీలకంగా మారనున్నాయి. హోమ్, అవే జట్ల కోసం వేర్వేరు లగ్జరీ డ్రెస్సింగ్ రూమ్‌లు, ఆధునిక జిమ్, జకుజీ, ఫిజియోథెరపీ మరియు రిహాబిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 80 మందికి పైగా క్రీడాకారులు బస చేసే క్లబ్‌హౌస్, ప్రత్యేక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా నిర్మించారు.

15-years-dream : ఎకో ఫ్రెండ్లీ డిజైన్‌తో

సహజ వెలుతురును వినియోగించేలా స్టేడియం నిర్మాణంలో పర్యావరణహిత సాంకేతికతలను ఉపయోగించారు. పాలీకార్బోనేట్ షీట్లతో రూపొందించిన నిర్మాణం విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించనుంది. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన అరుదైన స్టేడియంగా ఇది నిలవనుంది.

.15-years-dream : నేడు ఫలించిన కల..

మంగళగిరి స్టేడియం ప్రతిపాదనలు రెండు దశాబ్దాల క్రితమే రూపుదిద్దుకున్నప్పటికీ, నిర్మాణం అనేక కారణాలతో ఆలస్యమైంది. ప్రభుత్వాల మార్పులు, నిధుల కొరత, కాంట్రాక్టు వివాదాలు, భూసేకరణ సమస్యలు, కరోనా ప్రభావం వంటి అంశాలు పనుల పురోగతిని ప్రభావితం చేశాయి. అయితే ప్రస్తుతం అన్ని ప్రధాన సదుపాయాలు పూర్తి కావడంతో రాష్ట్ర క్రికెట్ అభిమానుల కల నిజమైంది. స్టేడియం అన్ని వసతులతో సిద్ధమైనప్పటికీ కొన్ని మౌలిక సదుపాయాల అంశాలు ఇంకా దృష్టి కోరుతున్నాయి. భారీ మ్యాచ్‌ల సమయంలో ట్రాఫిక్ నిర్వహణ, విస్తృత పార్కింగ్, లగ్జరీ హోటళ్ల లభ్యత, ప్రజా రవాణా అనుసంధానం వంటి అంశాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లను నిరంతరం నిర్వహించే స్థాయికి చేరాలంటే ఈ సవాళ్లను అధిగమించడం కీలకం.

15-years-dream : క్రీడా రాజధానిలో అమరావతి

ఏపీఎల్ మ్యాచ్‌లతో ప్రారంభమవుతున్న ఈ ప్రయాణం భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు మార్గం సుగమం చేయనుంది. విశాఖపట్నం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రధాన క్రికెట్ కేంద్రంగా మంగళగిరి అవతరించబోతోంది. అమరావతి ప్రాంతాన్ని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ స్టేడియం బలమైన పునాది వేస్తోందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర క్రికెట్ చరిత్రలో మంగళగిరి అంతర్జాతీయ స్టేడియం కేవలం ఒక క్రీడా వేదిక మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల క్రికెటర్లకు అవకాశాల ద్వారం, అమరావతి క్రీడా అభివృద్ధికి ప్రతీకగా నిలిచే మహత్తర నిర్మాణంగా అవతరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.