Revenue Minister | చుక్కల భూములకు త్వరలో విముక్తి

Revenue Minister | చుక్కల భూములకు త్వరలో విముక్తి

1.90 లక్షల ఎకరాలకు విముక్తి

Revenue Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని చుక్కల భూముల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. సుమారు 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు రాబోయే 10 నుంచి 15 రోజుల్లో విముక్తి కల్పిస్తామని ప్రకటించారు.

మంత్రి వివరాల ప్రకారం, స్పష్టమైన యాజమాన్య హక్కులు లేని భూములకు రెవెన్యూ రికార్డుల్లో యజమాని కాలమ్‌లో చుక్కలు నమోదు చేశారు. ఈ భూములు ప్రభుత్వానివా, ప్రైవేట్ వ్యక్తులవా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో వివాదాలు తలెత్తాయని తెలిపారు. ఈ కారణంగానే వాటిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు వివరించారు.

చుక్కల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఫ్రీహోల్డ్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరుపుతోందని, దీనికి సంబంధించిన నిర్ణయం కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని చెప్పారు. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం లభిస్తే వేలాది మంది భూయజమానులు తమ ఆస్తులపై పూర్తి హక్కులు పొందడంతో పాటు కొనుగోలు, అమ్మకాలు, రుణాల వంటి లావాదేవీలు సులభతరం కానున్నాయి.