14thto16th | జెన్-జీ.. జనసైన్యం
14thto16th | జెన్-జీ.. జనసైన్యం
14thto16th | లోకల్ టు గ్లోబల్
జనసేనాని జాతీయవాదం
పార్టీ శ్రేణులకు సరికొత్త నినాదం
సేనగళం పేరుతో ఐక్యతా రాగం
రేపటి నుంచి హస్తినలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు
హాజరుకానున్న 150 మంది జనసేన కీలకనేతలు
జెన్‌జీని ఆకర్షించడమే సేనగళం తొలి లక్ష్యం
14thto16th | అమరావతి, ఆంధ్రప్రభ : సామాజిక సామరస్యం, బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించే దిశగా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ‘సేన గళం’ పేరుతో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా దీన్ని ప్రారంభించారు. యువత, ముఖ్యంగా జెన్ జీ ఆకాంక్షలను ప్రతిబింబించేలా, రాజ్యాంగ విలువలపై నిలబడేలా ఈ వేదిక పనిచేయడానికి ఉద్దేశించిన ఓ నూతన వేదికగా సేన గళం ఉండబోతోంది. కాగా, ఈ వేదిక ద్వారా ఢిల్లీలో కీలక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ తెరతీయబోతోన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సేనగళం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. జాతీయ స్థాయిలో చేరికలకూ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ తరం యువతకు మార్గదర్శకం..
సుమారు 150 మంది జనసేన పార్టీ ముఖ్య నేతలతో కలిసి మూడు రోజుల పవన్ కళ్యాణ్ హస్తినలో చేయబోయే హడావుడి వెనుక ఒక బలమైన ఎజెండా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు సాధారణంగా నిధుల కోసమో, రాష్ట్ర ప్రాజెక్టుల కోసమో ఢిల్లీ వెళ్లడం చూస్తుంటాం. కానీ, పవన్ కల్యాణ్ ఒక సరికొత్త పొలిటికల్ ఐడియాలజీని దేశానికి పరిచయం చేయడానికి వెళ్తుండటమే ఇక్కడ అసలు ట్విస్ట్‌గా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సుదీర్ఘ ఆలోచనల నుంచి పుట్టిన సరికొత్త భావజాలమే ఈ ‘సేన గళం’. ఇది కేవలం ఒక రాజకీయ విభాగం మాత్రమే కాదు.. దేశంలోని నూతన తరం యువత మనోభావాలకు అద్దం పట్టే ఒక వేదిక. ప్రస్తుతం ఉన్న యువత పాతకాలపు కుల, ప్రాంతీయ సమీకరణాల కంటే పారదర్శకతను, రాజ్యాంగ విలువలని ఎక్కువగా కోరుకుంటోంది. వారి ఆశయాలకు ఒక పొలిటికల్ షేప్ ఇస్తూ.. జనసేన కేవలం ఏపీకే పరిమితమైన ప్రాంతీయ శక్తే కాదు, దేశవ్యాప్త యువత ఆలోచనలను ప్రభావితం చేయగల జాతీయ స్థాయి సిద్ధాంతాలున్న పార్టీ అని చాటిచెప్పడమే ఈ ‘సేన గళం’ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
వికృత ధోరణులను తొలగించేలా..
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త వికృత ధోరణి కనిపిస్తోంది. ఎవరో వ్యక్తిగతంగా తప్పు చేస్తే.. దాన్ని ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తూ సోషల్ మీడియా వేదికగా కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఇలాంటి చీప్ పాలిటిక్స్‌ను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి తప్ప, సమాజాన్ని విడదీయకూడదనే హెల్తీ మెసేజ్‌ను పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. ఈ సరికొత్త సామాజిక సామరస్య సందేశాన్ని నేషనల్ మీడియా ముఖంగా దేశవ్యాప్తంగా చర్చకు పెట్టడమే పవన్ కల్యాణ్ ప్రధాన లక్ష్యం. దీని కోసమే ఢిల్లీలో సేన గళం పేరుతో జనసేనాని గళమెత్తనున్నట్టు తెలుస్తోంది.
