147feet | ప్రకృతి సౌందర్యం మరియు భౌగోళిక విశిష్టతల అపురూప కలయిక

147feet | ప్రకృతి సౌందర్యం మరియు భౌగోళిక విశిష్టతల అపురూప కలయిక

147feet | కుంతల జలపాతం ప్రత్యేకతలు
భౌగోళిక నిర్మాణం మరియు ఎత్తు
చారిత్రక మరియు పౌరాణిక నేపథ్యం
పర్యావరణం మరియు జీవవైవిధ్యం
పర్యాటక అభివృద్ధి మరియు సౌకర్యాలు
ప్రమాదాలు మరియు భద్రతా సూచనలు
ప్రయాణ మార్గాలు మరియు చేరుకునే విధానం
పర్యాటకులకు ముఖ్య సూచనలు

147feet | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య వెలసిన కుంతల జలపాతం, కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, తెలంగాణ భౌగోళిక వైవిధ్యానికి ఒక నిలువుటద్దం.

ఆశ్చర్యపరచే భౌగోళిక ఉనికి మరియు ఎత్తు కుంతల జలపాతం కడెం నదిపై ఏర్పడింది, ఇది గోదావరి నదికి ప్రధాన ఉపనది.

కుంతల జలపాతం ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 147 అడుగుల (45 మీటర్లు) ఎత్తు నుండి కిందికి దూకుతుంది. అధికారిక రికార్డుల ప్రకారం ఇది తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా గుర్తించబడింది.

ఈ కుంతల జలపాతం రెండు అంచెలుగా ఉంటుంది. పై భాగం నుంచి నీరు కింద ఉన్న గుండంలోకి పడి, అక్కడి నుండి మళ్లీ ప్రవాహం కొనసాగుతుంది.

చారిత్రక మరియు పౌరాణిక నేపథ్యం ప్రత్యేకమైనది. స్థానిక చారిత్రక కథనాల ప్రకారం, ఈ జలపాతానికి ఆ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
మహాభారతంలోని శకుంతల ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధురాలై, ఈ జలపాతం వద్దే స్నానం చేసేదని, అందుకే దీనికి శకుంతల పేరు మీదుగా ‘కుంతల’ అనే పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం.

ఈ విశ్వాసానికి ఆధారం…ఈ ప్రాంతంలో ఉన్న ప్రాచీన గుహలు మరియు శివలింగం ఇక్కడి పౌరాణిక ప్రాశస్త్యాన్ని బలపరుస్తున్నాయి.

కుంతల జలపాతం దట్టమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉంది. పర్యావరణ మరియు జీవవైవిధ్యం ఈ అటవీప్రాంతం యొక్క విశిష్టత.

ఇక్కడి వృక్షజాలం ఒక అపురూపమైన ఆయుర్వేద నిధి. ఇక్కడ టేకు, వెదురు మరియు అనేక రకాల ఆయుర్వేద మూలికలు లభిస్తాయి.

అభయారణ్యం కావడం వల్ల అనేక రకాల పక్షులు, వన్యప్రాణులకు ఇది ఆవాసం. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ జలపాత ప్రవాహం కీలక పాత్ర పోషిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం కుంతలను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది.

జలపాతం వద్దకు చేరుకోవడానికి సుమారు 400 మెట్లు నిర్మించారు. పర్యాటకుల కోసం వ్యూ పాయింట్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు.

ఈ జలపాతం అందాలను వీక్షించడానికి సరైన సీజన్ వర్షాకాలం (జూలై నుండి అక్టోబర్ వరకు) ఈ జలపాతం తన పూర్తి వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ సమయంలో వేల సంఖ్యలో పర్యాటకులు రావడం వల్ల స్థానిక గిరిజన గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి.

ప్రకృతి అందంతో పాటు ఈ జలపాతం వద్ద కొన్ని భద్రతా అంశాలు సవాళ్లు, మరియు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

గుండం లోతు ప్రమాదకరమైనది. జలపాతం పడే చోట నీటి లోతు మరియు రాళ్ల అమరిక ప్రమాదకరంగా ఉంటుంది. నిరంతరం నీళ్ళు పడుతూండడం అక్కడి రాళ్ళన్నీ నాచుతో జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధించింది.

పర్యాటకుల సంఖ్య పెరగడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలోకి చేరడం కూడా ఒక పెద్ద సవాలుగా, ప్రకృతికి ప్రమాదకరంగా మారింది. పర్యావరణ ప్రేమికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుంతల జలపాతం తెలంగాణ ప్రకృతి సంపదకు ఒక చిహ్నం. దీనిని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా, పర్యావరణ పరంగా ఎంతో విలువైన ఆస్తిగా గుర్తించాలి. ఇక్కడికి సందర్శన నిమిత్తం వచ్చే పర్యాటకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పారేయడం వల్ల వాటిని అక్కడి పక్షులో, జంతువులో తిని అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉండొచ్చన్న స్పృహ కలిగి ఉండాలి. ప్రభుత్వం కూడా కఠినంగా మరింత భద్రతా ప్రమాణాలను పెంచితే, కుంతల అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది.

నిర్మల్ నుండి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాద్-హైదరాబాద్ జాతీయ రహదారి (ణ్ 44) కి సమీపంలో ఈ జలపాతం ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించడం ఒక మరుపురాని అనుభూతి.

కుంతల జలపాతానికి ప్రయాణ మార్గాలు ఇవే..

  1. సొంత వాహనం లేదా ట్యాక్సీలో హైదరాబాద్ నుండి వెళ్లేవారు ఎన్.హెచ్ 44 మీదుగా ప్రయాణించాలి. ఇది అత్యంత సౌకర్యవంతమైన మార్గం.
    మార్గం: హైదరాబాద్ -> కామారెడ్డి -> నిర్మల్ -> నేరడిగొండ -> కుంతల.
    ప్రయాణానికి పట్టే సమయం: హైదరాబాద్ నుండి సుమారు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది దూరం సుమారు 260-280 కి.మీ.
    నేరడిగొండ వద్ద మలుపు: హైవేపై నేరడిగొండ గ్రామం దాటిన తర్వాత కుంతల జలపాతానికి వెళ్లే సైన్ బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుండి లోపలికి సుమారు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి.
  2. బస్సు ప్రయాణం అయితే ఎలా వెళ్ళాలి?

ప్రజా రవాణా ద్వారా వెళ్లాలనుకునే వారు నిర్మల్ లేదా ఆదిలాబాద్ వరకు వెళ్లి, అక్కడ నుండి లోకల్ బస్సులు లేదా ఆటోలను ఆశ్రయించాల్సి ఉంటుంది.

బస్సు: హైదరాబాద్ (ఎంజీబీఎస్, లేదా జేబీఎస్ నుండి నిర్మల్ లేదా ఆదిలాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కాలి.

కనెక్టివిటీ: నిర్మల్ బస్టాండ్ నుండి నేరడిగొండకు వెళ్లే బస్సులు ఉంటాయి. అక్కడి నుండి ప్రైవేట్ ఆటోలు లేదా షేర్ ఆటోల ద్వారా జలపాతానికి చేరుకోవచ్చు.

రైలు మార్గంలో వెళ్ళడ్మ్ కష్టం. ఎందుకంటే..

    కుంతలకు నేరుగా రైలు సౌకర్యం లేదు. సమీప రైల్వే స్టేషన్ ఆదిలాబాద్ లేదా మంచిర్యాల.
    మళ్ళీ అక్కడి నుండి స్టేషన్ నుండి జలపాతానికి వెళ్లడానికి ట్యాక్సీలు లేదా బస్సులు అందుబాటులో ఉంటాయి.

    కుంతల జలపాతాని వెళ్ళాలనుకునే వారికి ముఖ్యమైన సూచనలు..

    సమయం: కుంతల జలపాతం ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే పర్యాటకులకు అనుమతి ఉంటుంది. చీకటి పడకముందే తిరుగు ప్రయాణం అవ్వడం మంచిది.

    నడక: పార్కింగ్ స్థలం నుండి జలపాతం వద్దకు చేరుకోవడానికి సుమారు 400 మెట్లు దిగాల్సి ఉంటుంది. వృద్ధులు మరియు మోకాలి నొప్పులు ఉన్నవారు జాగ్రత్త వహించాలి.

    ఆహారం: జలపాతం వద్ద పెద్దగా హోటళ్లు ఉండవు. నేరడిగొండ లేదా నిర్మల్ వద్దే భోజనం పూర్తి చేసుకోవడం లేదా వెంట తెచ్చుకోవడం ఉత్తమం.

    జాగ్రత్త: ముందుగానే మనం చెప్పుకున్నట్టు జలపాతం పడే గుండం చాలా లోతుగా ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్లడం ప్రమాదకరం.

    CLICK HERE TO READ

    CLICK HERE TO READ MORE Weekend Getaway | గోదావరి తీరంలో అద్భుతమైన వన్యప్రాణుల స్వర్గధామం

    Leave a Reply