రైజ్ ఆధ్వర్యంలో నేటివ్ అరకు కాఫీ వర్క్‌షాప్…

రైజ్ ఆధ్వర్యంలో నేటివ్ అరకు కాఫీ వర్క్‌షాప్…

ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన
మహిళల సాధికారతకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రోత్సాహం

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నేటివ్ అరకు కాఫీపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. గ్రామీణ మహిళలలో స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం, ఆర్థికంగా స్వావలంబన దిశగా ముందుకు నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో 102 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు పాల్గొన‌గా.. నేటివ్ అరకు కాఫీ సంస్థ సీఈవో రామ్ కుమార్ వర్మ ప్ర‌స్తుతం కాఫీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలపై సమగ్రంగా వివరించారు.

అర‌కు ప్రాంతానికి చెందిన కాఫీ ప్రత్యేకతలు, సహజ పద్ధతుల్లో సాగు, నాణ్యమైన గింజల ఎంపిక, ప్రాసెసింగ్ విధానాల‌తో పాటు ప‌లు సాంకేతిక అంశాలను వివరించారు. అదేవిధంగా విలువ ఆధారిత కాఫీ ఉత్పత్తుల తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. మార్కెటింగ్ పరంగా స్థానిక మార్కెట్లు, బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రాధాన్యత, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు కొత్త రంగాలలో నైపుణ్యాలను సంపాదించి, స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలు, శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు. రైజ్ కేంద్రం ద్వారా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply