APL-2026 | క్రికెట్‌తో పాటు సంస్కృతి, వినోదం కూడా..

APL-2026 | క్రికెట్‌తో పాటు సంస్కృతి, వినోదం కూడా..

కళాకారులకు ప్రోత్సాహం
రాష్ట్ర క్రికెట్ వికాసానికి కట్టుబడి ఉన్న ఏసిఏ..
రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ వికేంద్రీకరనే లక్ష్యం..
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాద్..

APL-2026 | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను కేవలం క్రికెట్ టోర్నమెంట్‌గా కాకుండా క్రీడలు, సంస్కృతి, వినోదం, పర్యాటకం ఆర్థికాభివృద్ధికి వేదికగా తీర్చిదిద్దుతున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. విజయవాడలోని గురు నానక్ కాలనీలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏపీఎల్ పోటీలను విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గతంలో విశాఖపట్నానికి మాత్రమే పరిమితమైన ఏపీఎల్‌ను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించామని, మూడు ప్రాంతాల క్రికెట్ అభిమానులకు ప్రత్యక్షంగా మ్యాచ్‌లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

APL-2026 | మూడు నగరాల్లో అట్టహాసంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్…

ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో, మధ్య దశ మ్యాచ్‌లు కడపలో, సెమీఫైనల్స్, ఫైనల్‌తో పాటు కీలక మ్యాచ్‌లు మంగళగిరిలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఏపీఎల్-2026లో ఏడు జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. మంగళగిరి, కడప స్టేడియాల్లో విస్తృత స్థాయిలో ఆధునికీకరణ పనులు చేపట్టామని, ఫ్లడ్‌లైట్లు, మీడియా గ్యాలరీలు, వీఐపీ లాంజ్‌లు, ప్లేయర్స్ సదుపాయాలు, ప్రసార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంగళగిరి స్టేడియాన్ని భవిష్యత్తులో ప్రధాన క్రికెట్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

APL-2026 | విద్యార్థులకు ఉచిత పాసులు..

ఈసారి ఏపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక సంస్కృతి, జానపద కళలను ప్రోత్సహిస్తున్నామని కేశినేని శివనాథ్ తెలిపారు. తోలుబొమ్మలాట, గరగలు, కోలాటాలు తదితర సంప్రదాయ కళారూపాలతో ప్రతిరోజూ స్టేడియాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మ్యాచ్‌లకు ముందు ప్రముఖ గాయకులు, సినీ కళాకారులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, క్రికెట్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని వెల్లడించారు.

కళ, వినోదం, క్రీడలు కలిసిన సమగ్ర ఉత్సవంగా ఏపీఎల్‌ను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.కాలేజీ విద్యార్థులకు ఉచిత పాస్‌లు అందజేసి యువతను పెద్ద సంఖ్యలో స్టేడియాలకు ఆకర్షించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఏపీఎల్ మంచి వేదికగా మారిందని, పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా రంగం, పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఆర్థిక కార్యకలాపాలు పెరగాలంటే ఇటువంటి ఈవెంట్లు అవసరమని చెప్పారు. మంగళగిరి స్టేడియానికి విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రేక్షకులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని కేశినేని శివనాథ్ వెల్లడించారు.

CLICK HERE TO READ MORE : Rs 3,054cr : అందరూ ‘సిద్ధం Andhra Prabha Top News

CLICK HERE TO READ MORE