అప్పు చెల్లించలేదని..

పెట్రోల్ బంకును మూయించిన గ్రామస్తులు
పులిగడ్డ-విజయవాడ కరకట్టపై చల్లపల్లి మండలం, నడకుదురు వద్ద ఘటన
చల్లపల్లి, ఆంధ్రప్రభ : బకాయిలు తీర్చలేదని పెట్రోల్ బంకును మూసివేయించిన ఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం పులిగడ్డ – విజయవాడ కరకట్టపై నడకుదురు వద్ద ఏర్పాటుచేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు బంకు నిర్మాణం నిమిత్తం నడకుదురుకు చెందిన డొక్కు దుర్గారావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.1.07 కోట్లు అప్పు తీసుకుని బంకు ఏర్పాటు చేశారు.
దుర్గారావు తన వద్ద డబ్బు లేకపోయినా తెలిసినవారు కావడంతో ఊర్లో ఉన్న అనేకమంది రైతులు వద్ద నుంచి కొద్దికొద్దిగా అప్పు రూపంలో సేకరించి మొత్తం కలిపి 1.07 కోట్లు బంక్ వారికి ఇచ్చారు. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా అప్పుడే రాసుకున్నట్లు చెబుతున్నారు. అయితే బొంకు ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బంకు నిర్వహణదారులు ఇప్పటివరకు అప్పు తీసుకున్న మొత్తంపై వడ్డీ గానీ, అప్పులో ఒక రూపాయి గాని తిరిగి చెల్లించలేదు. దీంతో పలుమార్లు విషయాన్ని పెద్ద మనుషుల వద్దకు తీసుకెళ్లారు. బంకు నిర్వహణల ధోరణికి విసుకు చెందిన అప్పుడు ఇచ్చినవారు చివరికి శుక్రవారం ఉదయం బంకు వద్దకు వచ్చి మూసి వేయించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
