Telangana farmers news | కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆవేదన
Telangana farmers news | కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆవేదన
Telangana farmers news | కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షం బారిన
రవాణా ఆలస్యం కారణంగా పెరుగుతున్న నష్టం
వర్షాలకు తడిసిన వేలాది బస్తాల ధాన్యం
వరంగల్లో గాలివానతో రైతు కుటుంబానికి విషాదం
Telangana farmers news | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం… పౌరసరఫరాలశాఖ జాప్యం అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. అయినప్పటికీ గత యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా ముగియకపోవడంతో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో పడి గాపులుగాస్తున్నారు. ఇప్పటికే మే నెలలో పలుమార్లు కురిసిన అకాల వర్షాల నుండి ధాన్యాన్ని తడవకుండా అన్నదాతలు అష్టకష్టాలు పడి కాపాడుకున్నారు. తాజాగా వర్షాకాలం ప్రారంభమైనా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రుతుపవన వర్షాలకూ ధాన్యం తడిసిముద్దవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలకు తడిసే ధాన్యం… ఈ ఏడాది మాత్రం రుతుపవన వర్షాలకూ తడిసి ముద్దవుతుండడం గమనార్హం.
వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోలేక, ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 శాతం కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం తూకం వేయాల్సి ఉంది. ఈ యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8557 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ఇప్పటికే 50 శాతం మేర అంటే 4447 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయి. ఇంకా మిగిలిన కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచికొడుతుండడంతో పలు జిల్లాల్లో టార్పాలిన్ షీట్లు కప్పిన ధాన్యాన్ని రక్షించుకోలేకపోతున్నారు.
వేలాది బస్తాలు వాన నీటిలోనే…
తాజాగా శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వేకువజామున కురిసిన వర్షాలకు మెదక్, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రైతులకు అపార నష్టం మిగిలింది. ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి, కాంటాలు కూడా పూర్తయిన వేలాది బస్తాల ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. లారీలు సకాలంలో రాకపోవడం, రవాణా ఆలస్యం కావడంతోనే ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలు జలమయమయ్యాయి. చిన్నశంకరంపేట మండలం కామారంలో తూకం వేసి సిద్ధంగా ఉంచిన రెండు లారీల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
కొల్చారం మండలం కొంగోడు కేంద్రంలో కూడా మూడు లారీల మేర వడ్ల బస్తాలు వర్షానికి నానిపోయాయి. వడ్లు అమ్ముకోవడానికి కేంద్రాలకు వచ్చి నెల రోజులు దాటుతున్నా రవాణా సదుపాయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లాలో గాలివాన ఓ రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి చేతికొచ్చిన పంట కాస్తా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గ్రామానికి చెందిన రైతు యుగేందర్ ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి సాగు చేసిన 17 ఎకరాల అరటి తోట ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా నేలమట్టమయింది. ఈదురు గాలులు, భారీ వర్షం లక్ష్మీపురం గ్రామాన్ని వణికించాయి. గాలి వేగానికి పెద్ద సంఖ్యలో అరటి చెట్లు విరిగిపడ్డాయి. చూస్తుండగానే తోటంతా నేలకొరిగింది.
