వయోజన విద్యలో గుంటూరు జిల్లా ముందుండాలి..

వయోజన విద్యలో గుంటూరు జిల్లా ముందుండాలి..

కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు, ఆంద్ర్రపభ : జిల్లాలో అక్షరాస్యత పెంపు లక్ష్యంగా చేపడుతున్న అక్షర ఆంధ్రా – ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

2026-27 సంవత్సరానికి జిల్లాకు 77,501 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. 2029 నాటికి రాష్ట్రాన్ని శతశాతం అక్షరాస్య రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం అంగన్వాడీ కేంద్రాల్లో వంద గంటల కరిక్యులంతో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆడియో-విజువల్ కంటెంట్, డిజిటల్ వీడియోలు, సాధన పత్రాల ద్వారా అభ్యాసకులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. గతంలో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌సీ పరీక్షల్లో జిల్లాకు మంచి ఫలితాలు రావడం ఆనందకరమన్నారు.

డ్వాక్రా సంఘాలు, శ్రామిక సంఘాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పని చేసి ప్రతి ఇంటా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి వాలంటీర్లు, అభ్యాసకుల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూలై 21 నుంచి తరగతులు ప్రారంభమై 2027 మార్చి వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

సమావేశంలో వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు కె. ఆంజనేయులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, సమాచార పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకులు లోచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply