భోజనంలో పురుగులు.. పస్తులతో విద్యార్థులు!
- నల్లబెల్లి జెడ్పీ పాఠశాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
- ఐదు రోజులుగా కలుషిత భోజనం అందుతోందని ఆరోపణ
- చర్యలు లేకుంటే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరిక
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో గత ఐదు రోజులుగా తెల్ల పురుగులు, లక్క పురుగులు వస్తున్నాయని తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు బుధవారం నల్లబెల్లి సబ్ పోస్టాఫీస్ ద్వారా రిజిస్టర్డ్ పోస్టులో వినతిపత్రం పంపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత పరికిరత్నం మాదిగ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తుండటంతో విద్యార్థులు అన్నం తినకుండా పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పాఠశాలకు బియ్యం సరఫరా చేస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకుంటే విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్, కుమారస్వామి, లక్ష్మి, స్థానిక ఎస్‌పీఎం అనిల్ తదితరులు పాల్గొన్నారు.
