భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత..

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా నియమించుకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని బస్సులు నడిపించేందుకు డిపోకు తీసుకురావడాన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. డిపో వద్దకు చేరుకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని అడ్డుకుంటూ, తమకు మద్దతు తెలపాలని, బస్సులు నడపవద్దని జేఏసీ నాయకులు చేతులు జోడించి వేడుకున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్థలంలో మోహరించిన పోలీసులు జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకుని, భద్రత మధ్య ఔట్సోర్సింగ్ కార్మికులను డిపోలోపలికి తరలించారు. అనంతరం వీరితో బస్సులు నడిపించే ప్రయత్నం అధికారులు కొనసాగించారు. ఇదిలా ఉండగా, డిపో బయట జేఏసీ నాయకులు మరింత ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వారికి వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా అపరిస్థితి తలెత్తకుండా డిపో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.
