ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం..
తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కల నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నాగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై సుబ్బారావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగాఎంపీడీఓ నాగేష్ మాట్లాడుతూ పూర్వకాలంలో చెట్లు, అడవులు అధికంగా ఉండటంతో సమృద్ధిగా వర్షాలు కురిసేవని, ప్రస్తుతం చెట్ల నరికివేత పెరగడం వల్ల వర్షపాతం తగ్గి రైతులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి కుటుంబం కనీసం పది మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామపంచాయతీలో మొక్కల పెంపకాన్ని విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపివో ప్రశాంత్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అధికారులు పిలుపునిచ్చారు.
