రూ.5 కోట్లతో రూయా అభివృద్ధికి..
రూ.5 కోట్లతో రూయా అభివృద్ధికి..
అత్యాధునిక వైద్య సేవలకు భారీ మౌలిక వసతుల విస్తరణ
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సుమారు రూ.5 కోట్ల వ్యయంతో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమలోనే ప్రతిష్ఠాత్మకమైన రూయా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు వేగంగా అందించేందుకు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా క్యాజువాలిటీ, ఐసీయూ, ఇతర కీలక విభాగాల్లో విద్యుత్ పనులు, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థల మరమ్మత్తులకు రూ.25 లక్షలు మంజూరు చేశారు. అత్యవసర విభాగానికి ఆధునిక అనస్థీషియా వర్క్‌స్టేషన్ కొనుగోలుకు రూ.16 లక్షలు కేటాయించారు.
జనరల్ సర్జరీలో లేజర్ శస్త్రచికిత్స పరికరాలకు రూ.12 లక్షలు, నిర్ధారణ సేవల కోసం హీమటాలజీ అనలైజర్లు, కోగ్యులేషన్ మీటర్లకు రూ.16 లక్షలు, రేడియాలజీ విభాగానికి రూ.10 లక్షలతో సీఆర్ క్యాసెట్లు కొనుగోలు చేయనున్నారు.
టీబీ–సీడీ బ్లాక్‌లో ఎయిర్, సెంట్రల్ సక్షన్ సిస్టమ్స్, వెంటిలేటర్లు, మానిటర్ల కోసం రూ.55 లక్షలు కేటాయించారు. రోగుల భద్రత కోసం 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో ప్రత్యేక ఓపీ బ్లాక్, ఓపెన్ డ్రైనేజీ స్థానంలో ఆర్‌సీసీ పైప్‌లైన్, సర్జికల్ ఆంకాలజీ బ్లాక్‌లో లిఫ్ట్, సీసీ రోడ్లు, మరుగుదొడ్లు వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.
సిబ్బంది కొరతను తీర్చేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, ఫార్మసిస్టులు, డ్రైవర్ల నియామకానికి కూడా ఆమోదం లభించింది.
సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రోగుల సంక్షేమమే ప్రాధాన్యమని, ఐవీఆర్ఎస్ సర్వేలో రూయా ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
