మహిళా సంఘాలకు రూ.5 కోట్ల ఆర్థిక సాయం

మహిళా సంఘాలకు రూ.5 కోట్ల ఆర్థిక సాయం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ:
మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని మహిళా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 42 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, ఇందిరా మహిళా శక్తి యూనిట్ల కోసం రూ.5 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి, వాటిని మహిళా సంఘాల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, ఎంఆర్వో అధికారులకు సూచించారు. మహిళా శక్తి కార్యక్రమం కింద పెట్రోల్ బంకులు సహా వివిధ ఆదాయ వనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు మరింత స్థిరపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి, మండల రెవెన్యూ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్, డీఎంసీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
