నవాబుపేటలో ఆర్టీసీ బస్సు నుంచి పడిపోయిన మహిళ

పాలమూరు, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో జరిగిన ప్రమాదంలో కదులుతున్న ఆర్టీసీ బస్సు నుంచి ఒక మహిళ కిందపడడంతో గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే… నవాబుపేట మండల కేంద్రం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 06 UD 0474)లో లొకిరేవు గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రయాణిస్తోంది. బస్సులోకి ఎక్కే సమయంలో తనతో తెచ్చుకున్న ఒక వస్తువును మర్చిపోయినట్లు ఆమె గమనించింది.

ఇప్పటికే బస్సు కదలడం ప్రారంభమైంది. దీంతో బస్సును ఆపమని ఆమె డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గించకపోవడంతో, ఆందోళనకు గురైన మహిళ కదులుతున్న బస్సులో నుంచి దిగేందుకు ప్రయత్నించి జారి కిందపడినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటన సమయంలో బస్సు కండక్టర్ మహిళపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.