శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించండి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ఉద్యమించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్కోటి చెన్నప్ప పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చెన్నప్ప మాట్లాడుతూ, 1886లో కార్మిక నాయకుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా కార్మిక హక్కులు సాధించుకున్న రోజు మే 1 అని గుర్తుచేశారు. ఎనిమిది గంటల పని దినం, పనికి తగిన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల ఫలితమే మేడే అని తెలిపారు.
ప్రస్తుతం భారతదేశంలో కార్మిక వర్గం సాధించిన హక్కులను ప్రభుత్వాలు క్రమంగా హరించుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, పని గంటల పెంపు, సమ్మె హక్కుపై పరిమితులు విధించడం వంటి చర్యలతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించటం ద్వారా శ్రమ దోపిడీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక వర్గం తమ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పనికి తగిన వేతనం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ మండల నాయకులు సుశాంత్, ఊట్కూర్ తాపీ మేస్త్రి సంఘం మాజీ అధ్యక్షుడు కూతలి నాగేష్, ఆంజనేయులు, టీఆర్ఎస్ మాజీ నాయకులు కృష్ణ మీనన్, కార్మికులు పాల్గొన్నారు.
