జనాభా వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

జనాభా వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

… చంద్రబాబుపై అవినాష్ తీవ్ర విమర్శలు

విజయవాడ, ఆంధ్రప్రభ: జనాభా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్వార్థం కోసమేనని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు.

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “అధిక జనాభా అవసరమా?” అనే చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేసిన చంద్రబాబే ఇప్పుడు అధిక జనాభా అవసరమని మాట్లాడటం ఆయన వైఖరిలోని మార్పుకు నిదర్శనమని ఆరోపించారు.

ప్రస్తుతం పెరిగిన ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో యువత తీవ్ర ఆందోళనలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఉన్న పిల్లలకే సరైన ఆహారం, విద్య, వైద్యం అందించలేని పరిస్థితుల్లో సామాన్య కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు.

ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆర్థిక కష్టాలతో జీవిస్తున్న సమయంలో మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు వంటి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మహిళలను గౌరవించాల్సిన ముఖ్యమంత్రి, వారిని పిల్లలు కనే యంత్రాల్లా చూపించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా ఖరీదైపోయాయని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు. ఉన్న పిల్లలకే నాణ్యమైన విద్య, వైద్యం అందించలేని పరిస్థితుల్లో అధిక జనాభాపై ఉపన్యాసాలు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు.

“సూపర్ సిక్స్” హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, “ఆడబిడ్డ నిధి” హామీ కూడా ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కొత్త నినాదాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని దేవినేని అవినాష్ సూచించారు.

Leave a Reply