కట్లేరు వాగు వద్ద విషాదం..

కట్లేరు వాగు వద్ద విషాదం..

  • ఇసుక తవ్వకాల సమయంలో అత్త–కోడళ్లపై పడిన మట్టి
  • కోడలు మృతి… అత్త పరిస్థితి విషమం..

గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని కట్లేరు వాగు వద్ద మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్‌లో ఇసుక నింపేందుకు వెళ్లిన అత్త, కోడళ్లపై అకస్మాత్తుగా మట్టి గడ్డలు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వివరాల ప్రకారం, గుంజి ధనలక్ష్మి (30), గుంజి నాగలక్ష్మి ఇద్దరూ ట్రాక్టర్‌లో ఇసుక నింపే పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో వాగు ఒడ్డున ఉన్న మట్టి గడ్డలు ఒక్కసారిగా కూలి వారిపై పడినట్లు సమాచారం.

మట్టి కింద ఇరుక్కుపోయిన ఇద్దరినీ స్థానికులు వెంటనే బయటకు తీయగా, అప్పటికే ధనలక్ష్మి ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మిని తొలుత స్థానికంగా చికిత్స అందించి, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply