రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం..

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం..

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఉన్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు యావత్ జీవితాన్ని అంకితం చేశారని మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ కన్వెన్షన్ హాల్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, మైలవరం నియోజకవర్గ టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.

ఈ శిబిరాలను ఎమ్మెల్యే వసంత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు. వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు 75 ఏళ్ల వయస్సులో నవ యువకుడిలా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు జీవన విధానం స్ఫూర్తి దాయకమన్నారు. ఏపీకి ఇలాంటి నాయకుడు లభించడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు.

సీఎం చంద్రబాబు విజనరీ నేడు ఉమ్మడి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా మార్చిందన్నారు. విజన్ 2020తో ఉమ్మడి ఏపీ అభివృద్ధికి బీజం వేశారని, ఇప్పుడు దాని ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో విజన్ 2047కు అడుగులు వేస్తున్నారన్నారు. వ్యవస్థలను గాడిలో పెడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దులుగా చేసుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నారన్నారు.

అమరావతి మహా నగరాన్ని నిర్మిస్తూ, ప్రజల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేస్తున్నారని తెలిపారు. నాలుగు పర్యాయాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, జాతీయ స్ధాయి ప్రముఖ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన మహానాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. క్రమశిక్షణ, ఓర్పు, పట్టుదల, కార్యదీక్ష, సమయస్ఫూర్తితో కూడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి” అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply