మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా..

  • జీతాల పెంపు, బీఎల్ఓ విధుల రద్దు అమలుకు డిమాండ్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం ధర్నా చౌక్‌లో అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు గౌరవ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) విధులను రద్దు చేసినప్పటికీ, కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో మాత్రం ఇప్పటికీ ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. వెంటనే బీఎల్ఓ విధుల నుంచి పూర్తిగా విముక్తి కల్పించాలని కోరారు.

అలాగే తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, జీతాల పెంపుతో పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.