రైతు మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి..
రైతు మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి..
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, ఆంధ్రప్రభ : నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 45 డిగ్రీల ఎండలో ఉన్న రైతు మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట డివిజన్ లోని నెక్కొండ మండలం అలంకాని పేట గ్రామానికి చెందిన మక్కజొన్న,వరి రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు మృతికి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నారని, 45 డిగ్రీల ఎండలో కాంటాల కోసం,బస్తాల కోసం ఎదురుచూస్తున్న రైతులు మనోవేదనకు గురిఅయ్యి మానసికంగా కృంగిపోతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.కాపుల కనపర్తి కొనుగోలు కేంద్రాo వద్ద మక్కాజొన్నాలు అమ్మడానికి అలంకానిపేట కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు అమ్మడానికి నెలరోజులుగా తిరిగి అలిసిపోయిన వెంకటేశ్వర్లు, మానసిక వేదనతో మృతి చెందాడని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అన్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని ప్రతిపక్ష పార్టీలు, రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వల్లనే ఈరోజు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద మృతి చెందే పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.
సాగు విస్తీర్ణం పంటల దిగుబడి పైన ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలను పెంచకుండా రైతులను కష్టాలపాలు చేస్తూ అరిగోస పెడుతు, వారి మృతికి కారణం అవుతున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.కొనుగోలు కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న చిల్లర దందాలు, అవినీతి అక్రమాల వలన కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతు న్నదనీ ఆరోపించారు. ధాన్యం తరలింపు, గోదాముల నిలువ పైన అవగాహన లేని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు.
వర్షాలు పడుతున్న ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలను పెంచకపోవడం దురదృష్టకరం అన్నారు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అకాల వర్షాలు పడడంతో మానసిక వేదనకు గురి అవుతున్నారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వలన రైతులు విత్తనాలను మొదలుకొని కరెంటు, ఎరువులు, సాగునీరు, పంట కొనుగోలు అన్ని దశలోను రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాట్లూ తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వేడి కొనుగోలు కేంద్రాలను పెంచి తక్షణమే రైతుల ధాన్యాన్ని తరలించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
